
దిశా పటాని (Disha Patani).. ఈ బాలీవుడ్ హీరోయిన్ పేరు వినగానే గ్లామర్ రోల్స్ ఎక్కువ గుర్తొస్తాయి. సినిమాలే కాదు, ఫొటోషూట్స్, సోషల్ మీడియా పోస్టుల్లోనూ ఆమె గ్లామర్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఆమె తన కెరీర్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తను హీరోయిన్‌గా పరిచయమైన ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం విడుదలై పదేళ్లు అవుతోంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. ఇప్పటివరకు తనుకు ఎదురైన అనుభవాలు ఓ నటిగా తనను మెరుగుపరిచాయని చెప్పింది. అంతేకాదు.. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్‌కు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించిన తాను.. భవిష్యత్తులో చేయబోయే పాత్రల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ విషయంలో కొత్త ప్రయోగాలు చేయబోతున్నానని, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను బయటపెట్టే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.
కథను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఎంచుకుంటానని వెల్లడించింది. సైకలాజికల్ డ్రామాస్, క్యారెక్టర్ డ్రివెన్ థ్రిల్లర్స్‌తో పాటు యాక్షన్ సినిమాల్లో ఛాలెజింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందంటూ తన విష్ లిస్ట్ బయటపెట్టింది. కెరీర్ విషయంలో మరింత రిస్క్ తీసుకుంటానని, భాష, జానర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని చెప్పింది.