
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండవు. ఒక ఆలోచనను తెరపై దృశ్యకావ్యంగా మార్చడమే కాదు, అవసరమైతే ఆ కథ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే పుట్టిస్తాడు. గతంలో ‘బాహుబలి’ కోసం కాలకేయుల తెగను చూపిస్తూ ‘కిలికి’ అనే ఒక ప్రత్యేక భాషను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన జక్కన్న, ఇప్పుడు అంతకుమించిన అతిపెద్ద సవాలును స్వీకరించినట్లు కనిపిస్తుంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబ్-ట్రాటింగ్ టైమ్-ట్రావెల్ ఎపిక్ ‘వారణాసి’ కోసం ఏకంగా సరికొత్త లిపి, సమగ్ర వ్యాకరణంతో కూడిన సరికొత్త ప్రాచీన భాషను సృష్టిస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఈ మూవీలో పాత్రల ప్రయాణం కేవలం దేశాలు, ఖండాలు దాటడానికే పరిమితం కాదని, వేర్వేరు కాలాల్లోకి, ముఖ్యంగా యుగాల వెనక్కి వెళ్లి రామాయణ కాలాన్ని కూడా తాకనుందని తెలుస్తుంది. స్టోరీ ప్రకారం, హీరో ఒక అన్వేషణ క్రమంలో రహస్య ప్రాచీన గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహ గోడలపై అప్పటివరకు ఎవరూ చూడని ఒక ప్రాచీన లిపిలో గూఢమైన సందేశాలు, చరిత్రకు సంబంధించిన కీలక రహస్యాలు లిఖించి ఉంటాయి. ఆ గుట్టు విప్పాలంటే, ఆ గోడలపై ఉన్న రాతలను డీకోడ్ చేసి చదవాల్సిందే. అంటే, ఆ లిపిని, భాషను అవగతం చేసుకోవడం కథలోనే అత్యంత కీలకమైన మలుపు కానుంది. స్క్రీన్‌పై ఏదో నాలుగు వింత పదాలు పలికించి సరిపెట్టే అలవాటు రాజమౌళికి అస్సలు ఉండదు. ఈ సీక్వెన్స్ కోసం ఒక ప్రముఖ భాషా నిపుణుడిని ప్రత్యేకంగా నియమించి, కథా నేపథ్యానికి తగినట్లుగా పక్కా వ్యాకరణ నియమాలు, వాక్య నిర్మాణం, స్పష్టమైన లిఖిత లిపిని డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచస్థాయి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో కనిపించే తరహాలో ప్రతి అక్షరానికి, ప్రతి ఉచ్ఛారణకు ఒక రూపాన్ని ఇస్తున్నారట జక్కన్న. ఇప్పటికే రామాయణ నేపథ్యం, విభిన్న యుగాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ‘వారణాసి’కి ఈ ప్రాచీన భాష సీక్వెన్స్ అతిపెద్ద హైలైట్‌గా మారనుందని తెలుస్తుంది. బాహుబలి ‘కిలికి’ భాషను మించిపోయేలా ఈ కొత్త ప్రయోగం వెండితెరపై ప్రేక్షకులకు ఎలాంటి గూస్‌బంప్స్ అనుభూతిని ఇస్తుందో చూడాలి.