
ఖైరతాబాద్ బడా గణేశుడికి తొలిపూజ ఘనంగా నిర్వహించారు. 72వ ఏట 69 అడుగులో కొలువుదీరిన బడా గణేశుడు పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. సోమవారం ( సెప్టెంబర్ 14 ) ఉదయం జరిగిన బడా గణేశుడి తొలిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ ప్రతాప్ శుక్లా. తెలంగాణ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి కానీ..హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఉత్సవాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయని అన్నారు గవర్నర్ శుక్లా.
ఇవాళ 69 అడుగుల గణేష్ మహారాజ్ కు తొలి పూజలు చేయడం చాలా ఆనందంగా ఉందని… తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. గణేష్ ఆశీర్వాదంతో నేను తెలంగాణ ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చానని అన్నారు శుక్లా.
ఈ ఏడాది బడా గణేష్ తో పాటు కాళీకమాత, సోమనాథ్ జ్యోతిలింగం, విశ్వ కర్మ, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా ఉదయం 6 గంటలకు బడా గణేశుడికి చేయవలసిన హారతి, ప్రత్యేక పూజలు ఆలస్యం అయ్యాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ దంపతుల చేతుల మీదుగా తొలి పూజ అందుకున్నాడు బడా గణేశుడు.
ఖైరతాబాద్ బడా గణేశుడి మండపం దగ్గర భక్తుల కోసం నలువైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక్కరోజు లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్న క్రమంలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు అధికారులు, ఖైరతాబాద్ ఉత్సవ సమితి.