
- ఫేక్ రిజిగ్నేషన్ లెటర్‌తో బీజేపీ సర్కార్‌పై విమర్శలు
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పదవికి తాను తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజీత్ దీప్కే రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించారు. బాలాఘాట్ జిల్లాలో 30 మందికి పైగా గిరిజన చిన్నారులు మృతి చెందిన ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన ఈ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
అధికారిక చిహ్నం, సీఎంఓ అడ్రస్, అసలైన సంతకంతో అచ్చం నిజమైన రాజీనామా లేఖలాగే కనిపించేలా ఒక ఫేక్ రిజిగ్నేషన్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్‌ను ఉద్ధేశించి రాసిన ఈ లేఖలో.. రాష్ట్రంలో వైద్యం, తాగునీరు, విద్య, పోషకాహారం తదితర రంగాల్లో ప్రభుత్వ వైఫల్యానికి తాను నైతిక బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే పిల్లలైతే ఇంతే ఇస్తారా?
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విషయంలోనూ ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గిరిజన సంఘాల నిరసనల తర్వాతే రూ. 2 లక్షల పరిహారాన్ని రూ. 4 లక్షలకు పెంచారని, ఒకవేళ ఆ పిల్లలు మంత్రులు లేదా ఎమ్మెల్యేల పిల్లలైతే ఇంతే ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు.
ఇన్‌ఫ్లూయెన్సర్ల నిరసన
ఈ సెటైరికల్ పోస్ట్‌కు ఒక్కరోజు ముందు బాలాఘాట్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన గిరిజన చిన్నారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన దీప్కేకు తీవ్ర నిరసన ఎదురైంది. ఆయన గ్రామస్తులను కలుసుకుని కారులో బయలుదేరుతున్న సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మహిళ ఒకరు ఆయనను అడ్డుకుని ‘శవాలపై రాజకీయాలు చేయడానికి వచ్చారా?’ అంటూ నిలదీసింది. వెంటనే దీప్కేను కార్యకర్తలు మరో కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు.