సినీ తారల వ్యక్తిగత జీవితాలు, వారి లుక్స్, ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం సెలబ్రిటీల మానసిక ఆరోగ్యంపై ఎంతగా ఉంటుందో తాజాగా నటి శ్రుతి మరాఠే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరాఠీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి మరాఠే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలకు భార్యగా, తల్లిగా కనిపించి ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్రకు ప్రత్యేకంగా పేరు లేకపోయినా.. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను ‘దేవర భార్య’గా గుర్తుంచుకుంటున్నారు. దేవర తర్వాత శ్రుతి మరాఠేకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సిరీస్‌లో ఆమె శ్రద్ధా సర్దేశాయ్ పాత్రలో నటించింది.
తన కెరీర్ ప్రారంభ దశలో బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న విషయాన్ని శ్రుతి గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆమె తన అనుభవాలను పంచుకుంది. తొలినాళ్లలో తాను చేసిన మరాఠీ సీరియల్ ప్రసారమైన తర్వాత కొందరు ప్రేక్షకులు తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె గుర్తుచేసుకుంది. ముఖ్యంగా ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు’ అంటూ వచ్చిన కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని తెలిపింది. ఆ సమయంలో తాను చాలా చిన్న వయసులో ఉండటంతో ఇలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని చెప్పింది.
శ్రుతి మరాఠే మాట్లాడుతూ.. తన శరీరాకృతిపై గతంలో ఎన్నో రకాలుగా కామెంట్స్ చేశారని తెలిపింది. ఒకప్పుడు లావుగా ఉన్నావంటూ విమర్శించినవారే.. ఇప్పుడు సన్నగా మారిపోయావంటూ మాట్లాడుతున్నారని చెప్పింది. ప్రజలు మన శరీరాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మనం లోపల ఎలా ఫీల్ అవుతున్నామో, మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వారు ప్రయత్నించరు. ఒకప్పుడు నేను చాలా లావుగా ఉన్నానని అన్నారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతో ఒత్తిడికి గురిచేశాయి. ఇప్పుడు నేను చాలా సన్నగా మారిపోయానని అంటున్నారు.
గత 15–20 ఏళ్లుగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాను. అందుకే ఇప్పుడు ఈ కామెంట్స్ వింటే నాకు నవ్వొస్తుంది అని శ్రుతి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ట్రోలింగ్ కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డానని శ్రుతి మరాఠే వెల్లడించింది. ఒక వ్యక్తి శరీరాకృతిని పదేపదే విమర్శించడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం తాను అలాంటి విమర్శలను పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది ఈ అందాల తార.




