
Harmanpreet Kaur Comments on Indian Fans: ఎన్నో రోజుల తర్వాత ఆసియా కప్‌ను గెలుచుకోవడంపై భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టులో అపారమైన ప్రతిభ ఉందని, టోర్నీకి వచ్చినప్పటి నుంచే తమ ఆటకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నామని తెలిపింది. కప్ గెలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022లో భారత్ టైటిల్ గెలిచింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి కప్ అందుకుంది. అభిమానులే తమకు అతిపెద్ద బలం అని, ఫాన్స్ ముఖాల్లో చిరునవ్వు కోసం ఏదైనా చేస్తాం అని చెప్పింది. భారత జట్టు ప్రదర్శనను అభిమానులు ఆస్వాదించడం చాలా సంతోషంగా అనిపించిందని, ఇక ముందు కూడా ఇదే ప్రదర్శనను కొనసాగించాలని అనుకుంటున్నాం అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.
‘మా జట్టులో ఎంతో ప్రతిభ ఉంది. మాది ఎంత మంచి టీమో మాకు తెలుసు. అందుకే ఈ విజయం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. మేం ఇక్కడికి వచ్చినప్పుడే కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. ప్రతిరోజూ వాటికి తగ్గట్టుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. అదే విధంగా మేం ఆడగలిగాం. జట్టు సభ్యులందరి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. టోర్నీ మొత్తం మా అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఫైనల్‌లో 184 పరుగులు చేయడం గొప్ప విషయం’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది.
‘ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకమైంది. పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకోవడం అంత సులభం కాదని మాకు తెలుసు. కానీ మా ఓపెనర్లు స్మృతి, షఫాలీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. షఫాలీ ఈ టోర్నీలో చాలా గొప్పగా ఆడింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ బాధ్యత తీసుకుని జట్టు కోసం తన వంతు కృషి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. మొత్తంగా మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అని హర్మన్‌ప్రీత్ తెలిపింది.
‘మా అభిమానులే మాకు అతిపెద్ద బలం అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. మేం ఎక్కడికి వెళ్లినా వారు మాకు మద్దతుగా నిలుస్తారు. వారి ముందు మేం ఎప్పుడూ గొప్ప క్రికెట్ ఆడాలని, మా అద్భుతమైన ప్రదర్శనతో వారిని అలరించాలని కోరుకుంటాం. ఈ రోజు వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటం, మా ప్రదర్శనను వారు ఆస్వాదించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాం. విజయోత్సవాలు కచ్చితంగా ఉంటాయి. మేం మా కోసం చాలా ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. ప్రతిరోజూ వాటికి తగ్గట్టుగా ఆడాల్సి వచ్చింది. జట్టు సభ్యులంతా ఒక్కటిగా నిలిచి ఈ విజయంలో భాగస్వాములు కావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.