
పల్లె బతుకులే వస్తువుగా… తెలంగాణ మాండలికమే ఆయుధంగా ఆయన కవిత సాగుతోంది.
“ఈ భూమ్మీద ఆకలి సావులు
ఏ లెక్క పర్కరామ్ జరుగుతున్నాయి.
ఏ మూలకంగా సత్తాండ్రు...”
అంటూ ఆకలి చావుల వెనుక దాగిన సామాజిక వేదనను ప్రశ్నించిన కవి ఆయన.
పదాల గారడీ లేదు… పాండిత్య ప్రదర్శన లేదు… అర్థంకాని భాష అసలే లేదు. తాను చూసిన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న పల్లె బతుకులను, సామాన్యుడి కష్టసుఖాలను ఉన్నది ఉన్నట్టుగా, సూటిగా, సరళంగా పలికించిన కవి తోకల కృష్ణమూర్తి యాదవ్. పల్లె జీవన పరిమళాన్ని తన కవిత్వంలో నింపుకున్నందుకే ఆయన ‘పల్లె కవి’గా సాహితీ లోకంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
తెలంగాణ మాండలికంలో వచన కవిత్వానికి తనదైన బాట వేసిన కృష్ణమూర్తి యాదవ్ రచనల్లో నేల వాసన కనిపిస్తుంది. పల్లె పలుకుబడి వినిపిస్తుంది. సామాన్యుడి కన్నీటి చప్పుడు వినిపిస్తుంది. శ్రమజీవి జీవితంలోని కష్టాలు, ఆకలి బాధలు, సామాజిక అసమానతలు ఆయన కవిత్వంలో ప్రతిఫలిస్తాయి. అందుకే ఆయన కవిత్వం చదివితే అది కేవలం అక్షరాల సమాహారంగా కాకుండా మన కళ్ల ముందు కదిలే పల్లె జీవిత చిత్రంగా అనిపిస్తుంది.
పల్లెలో పుట్టి పట్టణంలో స్థిరపడినా ఆయన మనసు మాత్రం పల్లె గడపను విడిచిపెట్టలేదు. నగర జీవితం ఆయన చిరునామాను మార్చినా… పల్లె ఆయన ఆలోచనలను మాత్రం మార్చలేకపోయింది. పల్లె ప్రజల బతుకులు, వారి భాష, యాస, ఆచార వ్యవహారాలు, బాధలు, ఆశలు ఆయన సాహిత్యానికి ప్రధాన వస్తువులయ్యాయి.
పల్లె మట్టిలో పుట్టిన అక్షర శిల్పి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో తోకల మల్లమ్మ–మల్లయ్య దంపతులకు 1940 నవంబర్ 6న కృష్ణమూర్తి యాదవ్ జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తి చేసిన ఆయన బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచారు.
1964 నుంచి 1998 వరకు కార్మిక శాఖలో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించారు. అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉద్యోగ జీవితం నగరంలో సాగినా… సాహిత్య ప్రయాణం మాత్రం పల్లె దారుల్లోనే కొనసాగింది.
‘తొక్కుడు బండ’
1998 మే నెలలో ఆయన తొలి కవితా సంపుటి ‘తొక్కుడు బండ’ వెలువడింది. పల్లె జీవనాన్ని, సామాన్యుల జీవిత గమనాన్ని ప్రతిబింబించిన ఆ సంపుటి అనతికాలంలోనే విశేష ఆదరణ పొందింది.ఆ తర్వాత 2000 అక్టోబర్‌లో ‘శబణం’, 2004 మార్చిలో ‘పిల్లల ఆకాశం’ వంటి రచనలు వెలువడ్డాయి. ఆయన రచనల్లోని సరళత, సహజత్వం, తెలంగాణ మాండలికపు మాధుర్యం పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కృష్ణమూర్తి యాదవ్ రచనా ప్రతిభకు దక్కిన మరో గౌరవం ఆయన రచనలు పాఠ్యపుస్తకాలలో చోటు సంపాదించడమే. ‘అమ్మ జ్ఞాపకాలు’ అనే ఆయన రచన 4, 7వ తరగతుల తెలుగు పుస్తకాల్లో ప్రచురితమైంది. ఆయన రచనా ప్రక్రియతో పాటు కవి పరిచయం కూడా పాఠ్యాంశంగా ముద్రితమైంది.
అక్షరాలకు మరణం లేదు..
వచన కవిత్వంలో తనదైన ముద్ర వేసిన కృష్ణమూర్తి యాదవ్ 2004 ఫిబ్రవరి 25న కన్నుమూశారు. అయితే కవి భౌతికంగా దూరమైనా… ఆయన అక్షరాలు మాత్రం పల్లె గాలిలో ఇప్పటికీ పరిమళిస్తూనే ఉన్నాయి.
కాలం మారుతుంది. తరాలు మారతాయి. జీవన విధానాలు మారతాయి. కానీ మనిషి ఆకలి, కన్నీరు, శ్రమ, ఆశ, ఆవేదనలకు అంతం ఉండదు. అందుకే వాటిని అక్షరాల్లో బంధించిన కృష్ణమూర్తి కవిత్వానికీ మరణం లేదు. ఆయన జీవితం ఒక జ్ఞాపకం కావచ్చు.కానీ ఆయన కవిత్వం మాత్రం పల్లె బతుకుల గుండెల్లో ఎప్పటికీ సజీవమే.
– తాళ్లపెల్లి సురేందర్, సీనియర్ జర్నలిస్ట్-