
మన దేశ ప్రజలకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంది.. ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కావాల్సిందే. మహిళలు ముఖ్యంగా ఒక్క గ్రామైనా కొనాలని చూస్తుంటారు. కొంతమంది ఈ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనడం మంచి నిర్ణయమే.. ఇది మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసి వాటితో ఆభరణాలను తయారు చేయించుకుంటారు. అప్పుడు అది స్వచ్ఛమైన బంగారం కాదు.. ఆ బంగారం ఆభరణంగా మారిన తర్వాత దానిలో స్వచ్ఛత శాతం తగ్గుతుంది.
ఆభరణాల తయారీలో ఇతర లోహాలు ఎందుకు కలుపుతారు?
ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం అనేది చాలా మెత్తగా ఉంటుంది. దీనితో నేరుగా ఆభరణాలు చేయడం కుదరదు.. కాబట్టి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు బంగారంలో ఇతర లోహాలను కలిపి నగలను తయారు చేస్తారు. అయితే ఆభరణాల తయారీలో ఎలాంటి లోహాలు వాడుతారో చాలా మందికి తెలియదు. అవేంటని చూస్తే.. స్వర్ణకారులు స్వచ్ఛమైన బంగారంలో రాగి, వెండి, నికెల్, కాడ్మియం, పల్లాడియం, జింక్ వంటి లోహాలను కలిపి బంగారు ఆభరణాలను తయారు చేస్తారట.
22 క్యారెట్లు.. 916 కేడీఎం గోల్డ్ అంటే ఏంటి?
మరో విషయం ఏమిటంటే.. చాలా మంది 24 క్యారెట్ల బంగారం అంటే 100 శాతం బంగారం అనుకుంటారు. ఆభరణాలు కూడా 100 శాతం బంగారంతో తయారు చేసినవి అనుకుంటారు.. కానీ 24 క్యారెట్స్ అంటే 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం మాత్రమే. ఇందులో ఇతర లోహాలను కలిపినప్పుడు దాని స్వచ్ఛత 22 క్యారెట్లకు తగ్గుతుంది. అందుకే ఆభరణాలను 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారని చెబుతున్నారు. అంటే మీరు కొనే ఆభరణాల్లో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం మాత్రమే ఉంటుంది.. మిగతా 8.4 శాతం ఇతర లోహాలు ఉంటాయి. దీన్నే 916 కేడీఎం (KDM) గోల్డ్ అని కూడా పిలుస్తారు.
ఆభరణాల్లో రకాలు!
అయితే ఈ ఆభరణాల్లో కూడా ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. 22 క్యారెట్స్ ఒకటి, 18 క్యారెట్స్ మరొకటి. 22 క్యారెట్స్ ఆభరణాలు అంటే వీటిలో ఇతర లోహాలు తక్కువ మోతాదులో కలుపుతారు. అదే 18 క్యారెట్స్ ఆభరణాలు అయితే వాటి తయారీలో ఇతర లోహాల కలయిక ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.