Reading Time: < 1 minute

కరీంనగర్‌‌‌‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్..స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా ఏర్పాటు 

Caption of Image.
  • జిల్లాలో 49,025 మంది విద్యార్థులకు టిఫిన్ 
  • 16న ప్రారంభించచున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ బ్రేక్‌‌ ఫాస్ట్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌ నిర్మాణం పూర్తయింది. ఈ కిచెన్ ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. ఈ నెల 16న సెంట్రలైజ్డ్ కిచెన్‌‌ను రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌‌నర్‌‌‌‌గా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు ఉదయం పోషకాహారంతో కూడిన టిఫిన్ అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రతతోపాటు అటెండెన్స్  మెరుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ బ్రేక్‌‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌‌ను పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌‌కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన రావడంతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నారు. ఈక్రమంలో కరీంనగర్‌‌‌‌లోనూ మరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌ను సిద్ధం చేశారు.

జిల్లాలో 49,025 మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. 

కరీంనగర్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన టిఫిన్ అందిస్తారు. ఇందుకోసం నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సహకారంతో రూపొందించిన మెనూను అమలు చేయనున్నారు. సోమవారం  ఇడ్లీ,  సాంబార్, మంగళవారం -పూరి, ఆలు కుర్మా, బుధవారం  దోష చట్నీ, గురువారం- ఉప్మా చట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ – సాంబార్, శనివారం బోండా చట్నీ అందించనున్నారు. ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది. విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు కూడా అందిస్తారు.

©️ VIL Media Pvt Ltd.