Reading Time: 2 minutes
Prithviraj Sukumaran Ssmb Varanasi Shoot Wrap 9 Movies Record

Prithviraj Sukumaran: భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సెట్‌లోకి అడుగుపెట్టి ప్రాజెక్ట్ ఒప్పుకున్న ఏ నటుడైనా.. సినిమా పూర్తయ్యే వరకు బయట మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి సినిమా కోసం ఏళ్లకే ఏళ్లు లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విషయంలో ఒక స్టార్ యాక్టర్ మాత్రం జక్కన్న రూల్ బుక్‌ను తిరగరాశారు. ఆయనే మాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్.

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో పృథ్విరాజ్ సుకుమారన్ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ చిత్రంలో పృథ్విరాజ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఇక్కడ అసలైన సెన్సేషన్ ఏంటంటే.. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి తన పార్ట్ షూటింగ్ ముగిసే లోపు ఆయన నటుడిగా, దర్శకుడిగా ఏకంగా 9 ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా జక్కన్నతో పనిచేసే నటులు మరొక వైపు కన్నెత్తి కూడా చూడలేరు. అలాంటిది ఇంతటి భారీ ప్రొడక్షన్ షెడ్యూల్స్‌ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, అటు తన రోల్‌ను బ్యాలెన్స్ చేస్తూనే వరుసగా సినిమాలు పట్టాలెక్కించి పూర్తి చేయడం పృథ్విరాజ్ సుకుమారన్ కెరీర్‌లోనే ఒక అరుదైన రికార్డుగా నిలుస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు.

పృథ్విరాజ్ సుకుమారన్ పార్ట్ పూర్తి కావడంతో పాటు ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఫైనల్ టచ్ పనుల్లో తలమునకలై ఉంది. కేవలం మరో మూడు వారాల ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని, అది కంప్లీంట్ కాగానే పూర్తిస్థాయి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ ప్రమోషనల్ కంటెంట్‌ను కూడా జక్కన్న టీమ్ రెడీ చేస్తోందట. ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మాధవన్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఇప్పటికే మేకర్స్ డేట్ లాక్ చేశారు.