
కోల్బెల్ట్, వెలుగు: బొగ్గు ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ పర్యావరణ హితం కోసం ముందడుగు వేస్తోంది. బొగ్గు గనుల ప్రాంతాలు, కార్మికవాడల్లో వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మిక, కార్మికేతర కుటుంబాలకు మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తోంది. ఏడేండ్లుగా సింగరేణి యాజమాన్యం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణి చేస్తోంది. ప్రతి ఏరియాలో 200 నుంచి 500పైగా విగ్రహాలను సీఈఆర్ క్లబ్, సింగరేణి స్టేడియాల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆయా ఏరియా సింగరేణి జీఎంలు, ఆఫీసర్లు, కార్మిక సంఘాల లీడర్ల చేతుల మీదుగా అందిస్తోంది.
ఈఏడాది శ్రీరాంపూర్ ఏరియా యాజమాన్యం ప్రత్యేకంగా విత్తన,మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, దీనిలో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
బెల్లంపల్లి/చొప్పదండి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని కాంటాచౌరస్తాలో ఆదివారం జనహిత సేవాసమితి ద్వారా ఉచితంగా అందించే మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్, చైర్‌పర్సన్ దావ స్వాతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ పద్మశాలీ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత ప్రారంభించారు.