July 16, 2026

మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు.. తెలంగాణలో చాలా స్పెషల్..

మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు.. తెలంగాణలో చాలా స్పెషల్..
Reading Time: 2 minutes
మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు.. తెలంగాణలో చాలా స్పెషల్..

వయసు పైబడుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రావడం, చర్మంపై ముడతలు పడటం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. వీటన్నిటికీ అద్భుతమైన విరుగుడు మటన్ బోన్ సూప్.. దీనిని మిగతా ప్రాంతాల వారు బోన్ సూప్ అని స్టైల్‌గా పిలిచినా, మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఇష్టంగా ‘బొక్కల చారు’ అని పిలుచుకుంటారు. ఈ సూప్‌లో ఉండే జెలటిన్, కొలాజన్ వంటి పోషకాలు ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా సీజన్‌లోనైనా వచ్చే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన తెలంగాణ ప్రత్యేక వంటకాన్ని ఎలా తయారు చేయాలో సింపుల్‌గా తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు:

  • మటన్ బోన్స్ (రిబ్స్/పక్కటెముకల భాగం) – ముప్పావు కిలో (3/4 Kg)
  • ఎండు కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు – 10
  • గసగసాలు – 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర – 1 టీస్పూన్
  • మిరియాలు – 1 టీస్పూన్
  • దాల్చిన చెక్క, లవంగాలు (5-6), యాలకులు (5), అనాసపువ్వు రేకులు (2)
  • నూనె – పావు కప్పు
  • ఉల్లిపాయలు – 2 (సన్నని ముక్కలు)
  • పచ్చిమిర్చి – 5 నుండి 6
  • పుదీనా – గుప్పెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  • టమాటా – 1 (బాగా పండిన దేశీ టమాటా)
  • కారం – 3 టేబుల్ స్పూన్లు
  • పసుపు – అర స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • వెల్లుల్లిపాయలు (పాయలు గడ్డలుగా) – 5 నుండి 6 (ఆప్షనల్)
  • కొత్తిమీర, నిమ్మరసం – తగినంత

తయారీ విధానం:

ప్రత్యేక మసాలాల ప్రిపరేషన్: ఒక గిన్నెలో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు వేసి, అవి మునిగే వరకు నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి.

స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు రేకులు వేసి లో-ఫ్లేమ్‌లో రెండు, మూడు నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి.

ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి, సువాసన పోకుండా మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.

నానబెట్టిన కొబ్బరి, జీడిపప్పు, గసగసాలను కూడా మిక్సీ జార్ లో వేసి, ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

బోన్స్ వేయించడం: కుక్కర్‌లో పావు కప్పు నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం వేయించి, శుభ్రంగా కడిగిన మటన్ బోన్స్ వేయాలి. అయితే.. మటన్ లో పక్కటెముకల దగ్గరి బోన్స్ అయితే సూప్ బాగా వస్తుంది..

మంటను అడ్జస్ట్ చేస్తూ బోన్స్‌ను నూనెలో 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. బోన్స్ నుండి నీరు ఊరి, ఆ నీరంతా ఆవిరైపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.

గ్రేవీ – చారు మసాలాలు:

ఆయిల్ సెపరేట్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి టమాటాలు మెత్తబడే వరకు మరో 2-3 నిమిషాలు వేయించాలి.

ఆ తర్వాత ముందుగా నూరుకున్న కొబ్బరి-గసగసాల పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఐదారు నిమిషాలు వేయించుకోవాలి.

ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ గడ్డలను (5-6) అలాగే వేసుకోవాలి. ఇది చలికాలం, వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఎసరు – ఉడికించడం:

వెల్లుల్లి వేసి కలిపిన తర్వాత, కూర ఉడకడానికి, చారు లాగా రావడానికి తగినన్ని వేడి వేడి నీళ్లు పోయాలి. కూర వేడిగా ఉన్నప్పుడు చన్నీళ్లు పోయకూడదు, వేడి నీళ్లే పోయాలి.

ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న ప్రత్యేక మసాలా పొడి కూడా వేసి బాగా కలిపి, ఉప్పు, కారం సరిచూసుకోవాలి.

చారు మరగడం ప్రారంభమైనప్పుడు కుక్కర్ మూత పెట్టి, మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి.

ఎలా సర్వ్ చేయాలి?

కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. పులుపు ఇష్టపడే వారు కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.

ఈ వేడి వేడి బొక్కల చారును అన్నం, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చపాతీ లేదా పూరీలతో తింటే అద్భుతంగా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పి ఉన్నవారు దీన్ని గ్లాసులో పోసుకుని సూప్‌లా నేరుగా కూడా తాగేయొచ్చు.

ఈ సూప్‌లో జెలటిన్, కొలాజన్ ఎక్కువగా ఉండటం వల్ల వేడిగా ఉన్నప్పుడు పల్చగా చారులా ఉన్నా, చల్లారేసరికి చిక్కగా (గట్టిగా) అయిపోతుంది. అందుకే దీనిని ఎక్కువ పులుసులా (చారులా) చేసుకుని, వేడి వేడిగా ఉన్నప్పుడే ఆస్వాదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..