Reading Time: < 1 minute

ప్రజాస్వామ్య విజయం.. దానం నాగేందర్ అనర్హత వేటు తీర్పుపై బండి సంజయ్ స్పందన

Caption of Image.

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‎పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్‎పై హైకోర్టు అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. శాసన వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న కాంగ్రెస్‏కు హైకోర్టు జడ్జిమెంట్ చెంపపెట్టు లాంటిదన్నారు.

 శాసన వ్యవస్థ విచక్షణాధికారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పీకర్ తలొగ్గడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తేది కాదని వ్యాఖ్యానించారు.

పట్టపగలు దేశమంతా చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం ఎంత తప్పో.. ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడం అంతే తప్పని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ/శాసన వ్యవస్థే అత్యున్నతం.. ఆ వ్యవస్థే పక్షపాతంగా వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనివార్యంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని సరిదిద్దుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

►ALSO READ | మిగిలిన వారికి ఇదే గతి.. దానం అనర్హత వేటు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్

కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థలనే ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదనేది తేట తెల్లమైందని విమర్శించారు. ఇకనైనా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా శాసనసభ స్పీకర్ వ్యవహరించాలని కోరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ బుక్‎ను పట్టుకుని షో చేసినంత మాత్రాన రాహుల్ గాంధీ రాజ్యంగ పరిరక్షకుడు కాలేరని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగం ఏం చెబుతుందో దానిని అనుసరించాలనే సోయిండాలి కదా అని చురకలంటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్‏పై ఒత్తిడి తెచ్చి శాసనసభ పరువు తీస్తుంటే పట్టించుకోరా..? శాసనసభ వ్యవస్థను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా ముందుకు రావాలని  పిలుపునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.