July 14, 2026

Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?

Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
Reading Time: 2 minutes
Off The Record About Congress Flexi Row Jakkidi Prabhakar Reddy Shiv Charan Reddy Audio Controversy Sparks Political Storm

Off The Record: చిన్న ఫ్లెక్సీ వివాదం… పెద్ద రచ్చకు దారి తీసింది. యాదగిరి గుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పెట్టిన ఫ్లెక్సీ అగ్గి రాజేసింది. అందులో పార్టీనేత జక్కిడి ప్రభాకర్ ఫోటో పెట్టలేదన్న వ్యవహారం రచ్చకు దారితీసింది. ఫ్లెక్సీలో ఫోటో లేదనే ఎపిసోడ్‌కు సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి… ఫోన్ సంభాషణలో నోరు జారినట్టు చెబుతున్నారు. ఆయన మాటలు యాదవ.. గౌడ సామాజిక వర్గాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అది మరవక ముందే శివ చరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయి. దాంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌ అయింది. ఇద్దరి ఆడియోలు లీక్ అవ్వడమే కాకుండా… అందులోకి pcc చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డిని కూడా లాగడం కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.

యూత్‌ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఏడు కోట్లు ఖర్చు చేసినట్టు ఫోన్‌లో అవతలి వ్యక్తితో చెప్పుకొచ్చారు ప్రభాకర్‌రెడ్డి. అయితే…. ఇందులో సభ్యత్వం కోసం చెల్లించిన డబ్బును పార్టీకి ఇచ్చారనే కోణంలో చర్చ మొదలవడంతో… పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సభ్యత్వం కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పిన మాటలు ఫైనల్‌గా పోస్ట్‌ కొనుక్కోవడానికి అన్నట్టుగా సోషల్‌ మీడియాలో చర్చలు మొదలవడంతో కలకలం రేగుతోంది. అంతే కాకుండా… బీసీ నాయకులపై చేసిన వ్యాఖ్యల విషయంలో కుల సంఘాలు సీరియస్‌గా ఉన్నాయి. ఈ విషయంలో చర్యల కోసం కాంగ్రెస్ బీసీ నాయకులంతా… పార్టీ అధినాయకత్వంపై వత్తిడి పెంచుతున్నారట. మధుయాష్కితో పాటు ఎల్బీ నగర్‌ కాంగ్రెస్ నేతలు పిసిసి చీఫ్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.

ఐతే మొత్తం ఎపిసోడ్ పై విచారణ జరిపి చర్యల కోసం నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లాను ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వ్యవహారం సీరియస్ అవడంతో… శివచరణ్ తండ్రి ప్రభాకర్ తగ్గారు. తన మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమాపణలు అని చెప్పారు. బయటకు వచ్చిన ఆడియోలు ఏఐ క్రియేటెడ్‌ అని చెప్పారాయన. అది ఒరిజినలా? ఏఐనా అన్న సంగతి అలా ఉంచితే…. చిన్న విషయం ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారింది. ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందోనన్న సందేహాలు కూడా పార్టీ వర్గాల్లో పెరుగుతున్నాయి. మరోవైపు ఈ ఎపిసోడ్‌పై సీఎం రేవంత్ సీరియస్‌గా ఉన్నారట. అటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. నేను బీసీలకు వ్యతిరేకం కాదు.. నా ఎదుగుదల ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ ఎపిసోడ్ ను ఇంతటితో వదిలేయండి అంటూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారాయన. తండ్రీ కొడుకుల సారీలతో కథ ముగిసినట్టేనా? లేక ఇంకా ఉందా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.