July 14, 2026

OTR: సింగనమల వైసీపీలో సెగలు..

OTR: సింగనమల వైసీపీలో సెగలు..
Reading Time: 2 minutes
Shinganamala Ysrcp Faces Internal Rift Shailajanath Struggles To Win Over Cadre

OTR: పెద్దలు సర్దుకుపొమ్మన్నంత తేలిగ్గా… కింది స్థాయిలో అడ్జెస్ట్‌ అవలేకపోతున్నారా? పార్టీలోకి కొత్తగా వచ్చిన సీనియర్‌ లీడర్‌తో అక్కడి వైసీపీ కేడర్‌ కలవలేకపోతోందా? మాజీ మంత్రి కూడా అయిన సదరు సీనియర్‌ బయటి వ్యవహారాలు చక్కబెడుతున్నా ఇంటిని దిద్దుకోలేకపోతున్నారా? రెండు వర్గాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? కలవలేకపోవడానికి కారణాలేంటి? రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చినంత తేలిగ్గా.. క్షేత్ర స్థాయి కేడర్ మారిపోదు. అందుకు కార్యకర్తల మనస్సాక్షి అంగీకరించదు కూడా. వారిలో బలమైన భావజాలం ఉంటుంది. మేము ఫలానా పార్టీ లేదా నేతకు దగ్గరగా ఉండాలనే ఫిక్స్ అవుతారు. ఒకవేళ పార్టీలోకి కొత్త నేత వచ్చినా…. ఎక్కువ సందర్భాల్లో అది పైకి బాగానే కనిపిస్తుందిగానీ… లోలోన మాత్రం ఆ అంతరం అలాగే ఉంటుంది. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలో అదే జరుగుతోందట. ఇక్కడ మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి మారారు. వాస్తవంగా వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీని వీడిపోతుంటే.. ఎవరూ ఊహించని విధంగా శైలజానాథ్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు శింగనమల ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్స్‌లో మంత్రిగా కూడా పనిచేశారాయన. అందుకే వచ్చీ రాగానే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. బయట బాగానే దూసుకెళ్తున్న శైలజానాథ్ ఇంటిని మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారట.

ఎందుకంటే… నియోజకవర్గంలో ఆరు మండలాలకు ఇప్పటికే బలమైన ఇన్ఛార్జ్‌లు ఉన్నారు. ఇంకా బలమైన నాయకులు కూడా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో శైలజానాథ్‌ వారందర్నీ కలుపుకుని పోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు నాయకులైతే… తాము ఆయన నాయకత్వంలో పని చేయలేమని బాహాటంగానే చెప్పేస్తున్నారట. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే.. శైలజానాథ్ రాక ముందు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డే రూలింగ్ చేసే వారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గాన్ని తన హోల్డ్ లో పెట్టుకున్నారాయన. అయితే గత ఎన్నికల్లో సామాజిక సమీకరణల కోణంలో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ రాలేదు. అయినాసరే… సాంబకు ప్రాధాన్యం తగ్గించకుండా ఆయన చెప్పిన వారికే టికెట్ ఇస్తామన్నారు పార్టీ పెద్దలు. ఫైనల్‌గా ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ ఇక్కడ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే సాంబ శివారెడ్డికి చెందిన వారు ఇక్కడ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారంతా ఆయనతో ఇప్పటికీ క్లోజ్ గానే ఉంటున్నారు. అటు సాంబశివారెడ్డి కూడా జగన్‌కు దగ్గరగా ఉంటూ కీలక వ్యవహారాలు చూస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో… శైలజానాథ్‌తో కలిసి పని చేసేందుకు సాంబ టీమ్‌ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దాంతో… శైలజానాథ్ బయట వ్యవహారాల్లో దూకుడుగా ఉన్నా.. పార్టీలో కీలకంగా పనిచేసిన మండల నాయకులతో అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారట. ఈ విషయాన్ని ఒకరిద్దరు కీలక నాయకులు అధినేత దగ్గరే చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని సెట్ చేసే ప్రయత్నాలు మొదలైనట్టు చెబుతున్నారు. ఏదేమైనా అంతా బాగుందనుకున్న శింగనమల వైసీపీలో అసలు లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.