July 12, 2026

మొన్న స్టోక్స్.. నేడు మెకల్లమ్.. ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి మెకల్లమ్ గుడ్ బై

మొన్న స్టోక్స్.. నేడు మెకల్లమ్.. ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి మెకల్లమ్ గుడ్ బై
Reading Time: 2 minutes

మొన్న స్టోక్స్.. నేడు మెకల్లమ్.. ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి మెకల్లమ్ గుడ్ బై

Caption of Image.

బ్రిటన్: ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‎ జట్టుకు బజ్ బాల్ పేరుతో కొత్త ఆటను పరిచయం చేసిన ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‎కలమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. ఇకపై వన్డే, టీ20 ఫార్మాట్లకు మాత్రమే కోచ్‎గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ధృవీకరించింది. బ్రెండన్ మెక్‎కలమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే టీ20, వన్డే జట్టుకు మాత్రం ఆయనే కోచ్‎గా కొనసాగుతారని ఈసీబీ వెల్లడించింది.  

టెస్ట్ జట్టు కోచ్ పదవికి రిటైర్మెంట్ సందర్భంగా మెక్‎కలమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను ఎంతో ఇష్టపడ్డా. మనం కలిసి సాధించిన దాని పట్ల నేను చాలా గర్వపడుతున్నా. ఈ ప్రయాణంలో కొన్ని అద్భుతమైన విజయాలు, కొన్ని కఠినమైన రోజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఆటలో సహజమే. పదవి నుంచి వైదొలగడం బాధగానే ఉంది. ఇకపై తన దృష్టి అంతా వైట్ బాల్ క్రికెట్‎పై ఉంటుంది’’ అని మెక్‎కలమ్ పేర్కొన్నాడు. 

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‎కు కొత్త గేమ్

2022లో నాలుగేళ్ల కాంట్రాక్టుతో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‎కలమ్ బాధ్యతలు చేపట్టాడు. తన పీరియడ్‎లో ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు బజ్ బాల్ పేరుతో కొత్త గేమ్ పరిచయం చేశాడు.మెక్‎కలమ్ గైడెన్సీలో ఆ జట్టు టెస్ట్ క్రికెట్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. టెస్ట్ ఫార్మాట్లో అత్యంత దూకుడుగా ఉండే క్రికెట్ శైలిని ప్రోత్సహించాడు. 

కోచ్‎గా మెక్ కలమ్ ఆరంభం విజయవంతంగా ప్రారంభమైంది. ఎందుకంటే మెక్‌కల్లమ్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఆడిన మొదటి 11 మ్యాచ్‌లలో 10 గెలిచింది. అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ ఇంగ్లండ్ ప్రదర్శన క్షీణించింది. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆ జట్టు 4-1 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 

అలాగే, గత ఏడాది ఇంగ్లండ్‌లో భారత్‌తో జరిగిన సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగింది. ఇంగ్లండ్ ప్రదర్శన ఇటీవల మరింత క్షీణించింది. ఎందుకంటే ఆ జట్టు ఆడిన చివరి తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లలో ఏకంగా ఏడింటిలో ఓటమి పాలైంది. 

ఇంగ్లండ్ తమ సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇదిలా ఉండగానే, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్‌లకు సంబంధించిన నైట్‌క్లబ్ సంఘటన తర్వాత ఆ జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఈ ఇష్యూ తర్వాత స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుండి ఆకస్మికంగా రిటైర్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్ కలమ్ వీడ్కోలు పలకడం గమనార్హం. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు అటు కెప్టెన్.. ఇటు కోచ్ ఇద్దరు లేరు. స్టోక్స్ స్థానంలో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు సారథ్య పగ్గాలు చేపడతాడని ప్రచారం జరుగుతోంది. కానీ మెక్‌కల్లమ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే దానిపై పూర్తి అనిశ్చితి నెలకొంది. అయితే, ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో రిచర్డ్ డాసన్, గారెత్ బ్యాటీ, ఆండ్రూ ఫ్లింటాఫ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలీ మరీ తదుపరి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, కోచ్‏గా ఎవరు ఎంపిక అవుతారనేది. 
 

©️ VIL Media Pvt Ltd.