Reading Time: 2 minutes

ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, జికా, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించడానికి దోమలే ప్రధాన కారణం. రకరకాల మందులు కొట్టినా ఈ దోమల బెడద మాత్రం తగ్గడం లేదు. అందుకే ఈ సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టడానికి గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. అదే ‘డీబగ్’ (Debug) ప్రాజెక్ట్. ల్యాబ్‌లోనే ప్రత్యేకమైన దోమలను ఉత్పత్తి చేసి, వాటి ద్వారా దోమల జనాభాను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

వొల్బాకియా బ్యాక్టీరియా సీక్రెట్: ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో మగ దోమలను పెంచుతారు. అయితే వీటికి ‘వొల్బాకియా’ (Wolbachia) అనే ఒక ప్రత్యేకమైన సహజ బ్యాక్టీరియాను ఎక్కిస్తారు. ఇక ఈ బ్యాక్టీరియా ఉన్న మగ దోమలు బయట తిరిగే సాధారణ ఆడ దోమలతో జతకట్టినప్పుడు.. ఆ ఆడ దోమలు పెట్టే గుడ్లు పొదగవు. అంటే వాటి నుండి కొత్త దోమలు పిల్లలు పుట్టవు. దీనివల్ల కాలక్రమేణా దోమల సంఖ్య భారీగా తగ్గిపోతుంది.

మనుషులకు ఇవి కుట్టవు.. పూర్తిగా సేఫ్: చాలామందికి కోట్లాది దోమలను బయటకు వదిలితే మనుషులకు ఇబ్బంది కాదా అనే డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రకృతిలో కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుట్టి రక్తాన్ని తాగుతాయి, మగ దోమలు అస్సలు కుట్టవు. ఇక గూగుల్ ల్యాబ్ నుండి విడుదల చేసేవన్నీ వొల్బాకియా ఉన్న మగ దోమలే కాబట్టి, ఇవి మనుషులను అస్సలు కుట్టవు. అందువల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు, ఇది పూర్తిగా సురక్షితం.

రోబోటిక్ పర్యవేక్షణలో ఉత్పత్తి: ఈ స్పెషల్ దోమలను మామూలుగా కాకుండా హైటెక్ రోబోలు, ఆటోమేటిక్ మిషన్ల సాయంతో ల్యాబ్‌లో ఉత్పత్తి చేస్తారు. ప్రతి దోమను పర్యవేక్షిస్తూ, కేవలం మగ దోమలను మాత్రమే వేరు చేయడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు.ఇక  అమెరికాలో రాబోయే రెండేళ్లలో దాదాపు 3.2 కోట్ల ప్రత్యేక మగ దోమలను ప్రకృతిలోకి విడుదల చేయడానికి గూగుల్ సంస్థ అనుమతి కూడా కోరింది.

ప్రమాదకర వ్యాధులకు శాశ్వత చెక్: ఈ డీబగ్ ప్రాజెక్ట్ విజయవంతమైతే డెంగ్యూ, జికా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేసే ‘ఈడిస్ ఈజిప్టి’ రకం దోమలను పూర్తిగా అరికట్టవచ్చు. రసాయనాలతో కూడిన దోమల మందులు కొట్టడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టం కూడా తప్పుతుంది.ఇక బయోలాజికల్ పద్ధతిలో దోమలను నిర్మూలించడానికి ఇదొక అద్భుతమైన మార్గమని సైంటిస్టులు చెప్తున్నారు.

Google’s ‘Debug’ Project Aims to Control Mosquito Populations
Google’s ‘Debug’ Project Aims to Control Mosquito Populations

ఇప్పటివరకు సెర్చ్ ఇంజన్, స్మార్ట్‌ఫోన్లతో మన జీవితాలను మార్చేసిన గూగుల్, ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి జీవ సాంకేతికతను (బయోటెక్నాలజీ) వాడుతుండటం నిజంగా విశేషం. టెక్నాలజీ సాయంతో దోమలపై చేస్తున్న ఈ సరికొత్త యుద్ధం సక్సెస్ అయితే, భవిష్యత్తులో దోమలు లేని, దోమల వల్ల వచ్చే జబ్బులు లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం చూడవచ్చు.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం గూగుల్ సంస్థ అంతర్జాతీయంగా చేపట్టిన రీసెర్చ్ ప్రాజెక్ట్ అవగాహన కోసం మాత్రమే. ప్రస్తుతం ఈ ప్రయోగం విదేశాల్లో అనుమతుల దశలో ఉంది.

The post దోమల నియంత్రణకు గూగుల్ ‘డీబగ్’ ప్రాజెక్ట్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.