Reading Time: 2 minutes

మనసు కాస్త విచారంగా ఉన్నప్పుడో.. లేదా గతంలో మనకు బాగా దగ్గరైన వారి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడో చాలామందికి తెలియకుండానే చేతులు ఫోన్ వైపు వెళ్తాయి. వాట్సాప్ ఓపెన్ చేసి పాత మెసేజ్‌లను, ఫొటోలను వెతకడం ప్రారంభిస్తారు. నేటి డిజిటల్ కాలంలో ఇదొక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, దీని వెనుక కేవలం అలవాటు మాత్రమే కాదు, బలమైన మానసిక కారణాలు కూడా ఉన్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం.

ఆ పాత మెసేజ్‌లలోనే ఓదార్పు ఎందుకు?: మానసిక ఒత్తిడి లేదా ఒంటరితనం వేధిస్తున్నప్పుడు మనస్సు ఎల్లప్పుడూ సురక్షితమైన వాతావరణాన్ని కోరుకుంటుంది. గతంలో ప్రేమ, ఆప్యాయత లభించిన క్షణాల్లోకి మెదడు ప్రయాణిస్తుంది. ఇక పాత మెసేజ్‌లను చదువుతున్నప్పుడు మన మెదడులో ‘డోపమైన్’ అనే సంతోషాన్నిచ్చే రసాయనం విడుదలై, తాత్కాలికంగా మానసిక ఓదార్పునిస్తుంది. అందుకే ఆ పాత చాట్లు చదివితే ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది.

Breakup Recovery: Is Reading Old Messages Helping or Hurting You?
Breakup Recovery: Is Reading Old Messages Helping or Hurting You?

బంధాలు తెగిపోయినప్పుడు మరీ ఎక్కువ: ముఖ్యంగా ప్రేమ బంధాలు విడిపోయినప్పుడు లేదా మనస్పర్థలతో దూరమైనప్పుడు పాత చాట్లను చదివే అలవాటు ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. బంధం ముగిసిపోయినా.. అసలు ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? అనే సంకేతాలను వెతకడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఆ మెసేజ్‌లు చదువుతున్నప్పుడు ఆనాటి భావాలను మళ్లీ అనుభవిస్తుంటారు. ఇది తాత్కాలికంగా బాగున్నా, జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది.

డిజిటల్ యుగంలో మానని గాయాలు: పూర్వ కాలంలో పాత జ్ఞాపకాలు కాలక్రమేణా మసకబారేవి. కానీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో గతం ఎప్పటికీ చెరిగిపోకుండా నిలిచిపోతోంది. ఇక పాత మెసేజ్‌లు, వాయిస్ నోట్స్ అన్నీ ఒక క్లిక్ దూరంలోనే అందుబాటులో ఉండటం వల్ల మానసిక గాయాలు మానడానికి చాలా సమయం పడుతోంది. పదేపదే వాటిని చూడటం వల్ల వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం, నిద్రలేమి, ఒంటరితనం పెరిగి చివరికి అది డిప్రెషన్‌కు దారితీసే అవకాశం ఉంది.

పాత జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తుచేసుకోవడం సహజమే కానీ, అదే లోకంగా బతకడం ప్రమాదకరం. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు పాడవుతుంది. అందుకే బ్రేకప్ తర్వాత ఆ పాత చాట్లకు ఎంత దూరంగా ఉంటే, మానసిక గాయాలు అంత త్వరగా మానిపోతాయి. ఇక వర్తమానంలో జీవిస్తూ, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయాన్ని గడపడం వల్ల ఈ అలవాటు నుంచి సులభంగా బయటపడవచ్చు.

గమనిక: పాత చాట్లు చూసిన తర్వాత బాధ తగ్గడానికి బదులు మరింత పెరుగుతున్నా, రోజువారీ పనులు చేసుకోలేనంతగా మానసిక స్థితి దెబ్బతింటున్నా.. ఆలస్యం చేయకుండా నిపుణులైన కౌన్సిలర్లను లేదా సైకాలజిస్టులను సంప్రదించడం మంచిది.

The post బ్రేకప్ తర్వాత చాట్లు చెక్ చేస్తున్నారా? ఇది మంచిదా కాదా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.