Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Sends Strong Warning To Gujarat Titans Ahead Of Ipl 2026 Qualifier 2

Vaibhav Sooryavanshi Sends Strong Warning To Gujarat Titans: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి భయం లేకుండా పరుగుల వరద పారిస్తున్న బుడ్డోడు.. నేడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. క్వాలిఫయర్-2 నేపథ్యంలో గిల్ సేనకు బుడ్డోడు ఓ హెచ్చరిక పంపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి తన దూకుడు చూపించిన వైభవ్.. క్వాలిఫయర్-2లో కూడా అదే అటాకింగ్ గేమ్ కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం మూడు పరుగుల తేడాతో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చేజార్చుకున్నాడు. ఆ రికార్డు మిస్ అవ్వడం తనకు ఎలాంటి బాధ లేదని తెలిపాడు. జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ… ‘నేను సెంచరీ కొట్టినా జట్టు ఓడిపోతే ఆ పరుగులకు విలువ ఉండదు. కానీ నేను 80 పరుగులు చేసి జట్టు గెలిస్తే అదే నాకు ఎక్కువ సంతోషం ఇస్తుంది’ అని చెప్పాడు. చిన్న వయసులోనే అతడు చూపిస్తున్న పరిపక్వత అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక మాట చెప్పేవారు. నువ్వు సెంచరీ చేసినా, డబుల్ సెంచరీ చేసినా, ట్రిపుల్ సెంచరీ చేసినా.. జట్టు గెలవకపోతే ఆ పరుగులకు అర్థం ఉండదు. క్రికెట్ అనేది చివరికి టీమ్ గేమ్. అందుకే వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యం’ అని వైభవ్ చెప్పాడు. ప్లేఆఫ్స్, ఫైనల్ వరకు జట్టు వెళ్తే తనకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని.. అప్పుడు రికార్డులు సహజంగానే వస్తాయని పేర్కొన్నాడు. క్వాలిఫయర్-2లో టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌పై కూడా వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘మేము ఎప్పటిలాగే పాజిటివ్ మైండ్‌సెట్‌తో బరిలోకి దిగుతాం. బిగ్ మ్యాచ్ అని ఒత్తిడి తీసుకోం. మా బలాలపై నమ్మకం పెట్టుకుని ఆనందంగా ఆడతాం. జట్టుగా ఫైనల్ చేరి ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశాడు. దీంతో గిల్ నేతృత్వంలోని గుజరాత్‌కు ఇది స్ట్రాంగ్ వార్నింగ్‌గా మారింది.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అత్యంత విలువైన ఆటగాడు (ఎంవీపీ) అవార్డు గెలుచుకునేందుకు ఫేవరెట్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్‌ల్లో 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్ 242.85 ఉండటం ఇక్కడ విశేషం. ప్రపంచ క్రికెట్‌లో కొత్త సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న వైభవ్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు 2008 తర్వాత మరోసారి టైటిల్ అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.