Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Compared To Shahid Afridi By Mohammad Yousuf Fans React Strongly

Netizens Trolls Mohammad Yousuf For Compare Vaibhav to Afridi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజాలు అతడిని సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ వంటి లెజెండ్స్‌తో పోల్చుతున్నారు. అయితే పాకిస్థాన్ మాజీ స్టార్ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్ మాత్రం వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ సూర్యవంశీ తనకు యువ షాహిద్ ఆఫ్రిదీని గుర్తు చేస్తున్నాడని మహ్మద్ యూసుఫ్ పేర్కొన్నాడు. ’15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే యువ షాహిద్ ఆఫ్రిదీ గుర్తుకు వస్తున్నాడు. ఎలాంటి భయం లేకుండా ఆడటం, దూకుడు, ఎనర్జీ అన్నీ అచ్చం ఆఫ్రిదీలానే ఉన్నాయి. సూర్యవంశీకి మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆఫ్రిదీ కూడా తన కెరీర్ ప్రారంభ దశలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. 1996లో తన తొలి వన్డే ఇన్నింగ్స్‌లోనే కేవలం 37 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు దాదాపు 18 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు.

ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా అదే తరహా నిర్భయ ఆట తీరుతో ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడని మహ్మద్ యూసుఫ్ భావించాడు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం ఈ పోలికను వ్యతిరేకించారు. ‘వైభవ్‌ను ఆఫ్రిదీతో పోల్చడం అవమానకరం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘సచిన్, బ్రాడ్‌మన్‌లతో పోల్చుతుంటే.. యూసుఫ్ మాత్రం ఆఫ్రిదీ అంటాడేంటి’ అని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇద్దరిలోనూ ఉన్న దూకుడు సామ్యమే యూసుఫ్ ఉద్దేశమని నెటిజెన్స్ అంటున్నారు.

ఇక నేడు జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ వికెట్ కీలకంగా మారనుంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ లాంటి టాప్ బౌలర్లు బుడ్డోని ఎలా కట్టడి చేస్తారన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే బుమ్రా, స్టార్క్, కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. ఇప్పుడు గుజరాత్ బౌలర్లకు కూడా సవాల్ విసరనున్నాడు. ప్రస్తుతం అతడు చూపిస్తున్న ఫామ్ చూస్తుంటే.. ఐపీఎల్ 2026 పూర్తిగా సూర్యవంశీదే అని అనిపిస్తోంది.