Reading Time: < 1 minute

హార్టికల్చర్, పాలిటెక్నిక్‌‌ కళాశాలను నిర్మిస్తాం : మంత్రి జూపల్లి

Caption of Image.
  • మంత్రి జూపల్లి 

కొల్లాపూర్, వెలుగు:  కొల్లాపూర్‌‌లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం కొల్లాపూర్ పట్టణ శివారులోని వరదెల పరిధిలో ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. సర్వే నంబర్‌‌ 56లో ఉన్న సుమారు 104.19 ఎకరాల భూమిని హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణాల కోసం  పరిశీలించి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల గురించి అధికారులతో చర్చించారు. కళాశాలల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.   

ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేస్తూ విద్యార్థులకు విద్యావకాశాలు, పేదలకు నివాస స్థలాలు కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంగా కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులు ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. జీతాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.