Reading Time: 2 minutes
Pat Cummins Praises Vaibhav Sooryavanshi After Srh Eliminator Loss Vs Rr In Ipl 2026

Pat Cummins Praises Vaibhav Sooryavanshiఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) పోరాడి ఓడిపోయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) నిర్ధేశించిన 244 పరుగుల ఛేదనలో 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన 38 పరుగులకే టాప్‌ స్కోరర్‌ అంటే ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఎంత దారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. రాజస్థాన్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌ ఇంటిముఖం పట్టింది. ఆర్ఆర్ విజయంలోయువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5×4, 12×6) కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. సూర్యవంశీ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడదాని, ఇలాంటి బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. వైభవ్ తమకు చుక్కలు చూపించాడని, అతడి వల్లే తాము ఓడిపోయాం అని చెప్పాడు.

చిన్న పొరపాటు చేసినా వైభవ్ సూర్యవంశీ దాన్ని భారీ షాట్‌గా మలుస్తాడని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ‘వైభవ్ నిజంగా అద్భుతంగా ఆడాడు. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఉండవు. మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. యార్కర్ కాస్త మిస్ అయినా అతడు వదిలిపెట్టడు. బంతి వెంటనే బౌండరీకి వెళుతుంది. అందుకే అతడికి క్రెడిట్ ఇవ్వాలి. వైభవ్ బ్యాటింగ్ సమయంలో చుక్కలు కనిపించాయి. అతడి ఇన్నింగ్స్ తేడా తీసుకొచ్చింది. టాస్ గెలిచి ఛేజ్ ఎంచుకోవడంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పిచ్ చివరి వరకు కూడా బాగానే ఉంది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే కొన్ని విషయాలు సరిగ్గా జరగాలి. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడానికి ఇదే సరైన మైదానం, సరైన పరిస్థితులు. మా జట్టు చాలా వరకు రన్‌రేట్‌కు అనుగుణంగా సాగింది. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ఓ వెనకపడిపోయాం. అయినప్పటికీ మేము మంచి పోరాటమే చేశాం’ అని కమిన్స్ తెలిపాడు.

యువ ఆటగాళ్ల ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లను ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్రశంసించాడు. ‘మా జట్టు చాలా సమతుల్యంగా ఉంది. ప్రఫుల్, సాకిబ్ అద్భుతంగా ఆడారు. వాళ్లకు పెద్దగా అనుభవం లేదు. ఈరోజు నేను ఒక గణాంకం చూశాను. ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరిన అత్యంత యువ జట్లలో మేము ఒకటి. బహుశా ఐపీఎల్ చరిత్రలో కూడా కావచ్చు. ఇది మా కోచింగ్ స్టాఫ్ ఎంత మంచి టాలెంట్‌ను వెలికితీసిందో చెప్పొచ్చు. కెప్టెన్‌గా అలాంటి యువ ఆటగాళ్లు ధైర్యంగా ఆడటం చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. గత మూడు సీజన్లలో రెండుసార్లు ప్లేఆఫ్స్ చేరాం. ఎస్ఆర్‌హెచ్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉంది. మేము టాప్-2కి చేరడానికి చాలా దగ్గర్లోనే ఆగిపోయాం. అయినప్పటికీ ఈ సీజన్ మొత్తం మా ఆటగాళ్ల వైఖరి అద్భుతంగా ఉంది. వాళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడారు. కెప్టెన్‌గా దానికంటే ఎక్కువ నేను కోరుకోలేను’ అని తెలిపాడు. ఈ ఓటమితో ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2026 ప్రయాణం ముగిసినా.. యువ ఆటగాళ్ల ప్రదర్శన, దూకుడైన క్రికెట్‌తో అభిమానుల మనసులు గెలుచుకుంది.