Reading Time: < 1 minute
Cinema Peddi Movie 78 Takes Dialogue Boman Irani Buchi Babu Ram Charan

Boman Irani: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బొమన్ ఇరానీ డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ చిన్నోడైనా.. ఆయన విజన్ మాత్రం చాలా పెద్దదని బొమన్ ఇరానీ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. హీరో రామ్‌చరణ్, నటుడు దివ్యేందు శర్మతో కలిసి ఆయన పాల్గొన్న ఒక ప్రత్యేక చిట్‌చాట్‌లో షూటింగ్ విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా బోమన్ ఇరానీ మాట్లాడుతూ.. బుచ్చిబాబుకు సినిమాపై ఉన్న ప్యాషన్‌ను వివరిస్తూ.. అనుకున్న అవుట్‌పుట్ వచ్చేంత వరకు ఆయన అస్సలు వదిలిపెట్టరని అన్నారు. ఈ క్రమంలో సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ కోసం ఏకంగా 78 టేక్స్ తీసుకున్నట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ మరేదో కాదని.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకున్న ‘క్రాస్‌ ఓవర్‌ అథ్లెట్‌’ డైలాగ్ అని చెప్పారు. ట్రైలర్‌లో విలన్ రవికిషన్ ఆవేశంగా ‘ఎవడాడు?’ అని అడిగే షాట్ తర్వాత.. హీరో రామ్‌చరణ్‌ను ఉద్దేశించి బొమన్ ఇరానీ ఉద్వేగభరితంగా ‘క్రాస్ ఓవర్ అథ్లెట్’ అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. ‘పెద్ది’ అనేది క్రీడా నేపథ్యంతో కూడిన ఒక అద్భుతమైన దేశభక్తి చిత్రమని బొమన్ స్పష్టం చేశారు.

ఇదే చిట్‌చాట్‌లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమా తన హృదయానికి ఎంతో కనెక్ట్ అయిందని చరణ్ చెప్పుకొచ్చారు. “షూటింగ్ సమయంలో రోజు ఇంటికి వెళ్లాక కూడా ఈ సినిమాలోని నా పాత్ర గురించి, సీన్ల గురించే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడేవాడిని. అంతగా ఈ కథలో లీనమయ్యాను. నా కెరీర్‌లో చాలా తక్కువ సినిమాలకే ఇలాంటి మ్యాజిక్ జరిగింది” అంటూ రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివ్యేందు ఆఫ్‌స్క్రీన్‌లో పక్కా జెంటిల్‌మ్యాన్ అని, కానీ ఆన్‌స్క్రీన్‌పై మాత్రం కాదంటూ చమత్కరించారు. సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’లో దివ్యేందు పోషించిన రగ్గడ్ క్యారెక్టర్‌ను ఉద్దేశించి చరణ్ ఈ కామెంట్స్ చేశారు.