Reading Time: < 1 minute

భువనగిరిలో ఉద్రిక్తత: మున్సిపల్ ఆఫీస్ ముట్టడి.. బాధితులు -పోలీసుల మధ్య ఘర్షణ

Caption of Image.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రహదారి విస్తరణకు వ్యతిరేకంగా బాధితులు రోడ్డెక్కారు. నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా మధ్య చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను నిరసిస్తూ బాధితులు పెద్ద ఎత్తున బైఠాయించారు.

తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ కార్యాలయం ముందు బాధిత కుటుంబాలు ఉధృత నిరసన చేపట్టాయి. రహదారి విస్తరణ కోసం జరుగుతున్న ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బాధితులు ప్రయత్నించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాధితులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు తమ పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించారని బాధిత మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు మహిళలను బూటు కాళ్లతో తన్నారంటూ పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారి విస్తరణ వల్ల మేము ఇళ్లు, ఉపాధి రెండూ కోల్పోయి రోడ్డున పడతాం. మాకు సర్వం పోతుంది. ఇక్కడ 30 ఫీట్ల రహదారి ఉంటే సరిపోతుంది, 60 ఫీట్ల విస్తరణ అస్సలు అవసరం లేదు అని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.

తమ పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్న బాధితులు… స్థానిక 9, 22, 23, 24, 25, 26 వార్డుల కౌన్సిలర్లు స్పందించి తమ పక్షాన నిలబడాలని ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.