
- అన్ని సిరీస్‌ల కీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఎన్టీఏ
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2026) ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. అన్ని సెట్ల క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ లో తమ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం ప్రైమరీ కీని మాత్రమే విడుదల చేసిన ఎన్టీఏ, త్వరలోనే అభ్యర్థుల స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.
ఓఎంఆర్ షీట్లు అప్‌లోడ్ చేసిన తర్వాతే, కీలో ఏవైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని నోటీసులో స్పష్టం చేసింది. అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన షెడ్యూల్, ఫీజు వివరాలను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని తెలిపింది. నీట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలున్నా లేదా స్పష్టత కావాలన్నా ఎన్టీఏ హెల్ప్ లైన్ నంబర్లు 011–-40759000 , 011–-69227700 నంబర్లను సంప్రదించవచ్చు. neetug2026@nta.ac.in మెయిల్ ఐడీ ద్వారా అధికారులను సంప్రదించాలని వారు సూచించారు.