Reading Time: < 1 minute

ఆముదం గింజలతో విషప్రయోగం కేసులో ఎన్‌‌ఐఏ ఛార్జిషీట్‌‌

Caption of Image.
  • రాజేంద్రనగర్‌‌ డాక్టర్ మొహియుద్దీన్‌‌ సహా మరో ఇద్దరిపై అభియోగాలు
  •  సామూహిక కార్యక్రమాల్లో విష ప్రయోగానికి స్కెచ్ వేసినట్లు వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: విషప్రయోగం ద్వారా ‘బయో టెర్రరిజం’ సృష్టించేందుకు కుట్ర పన్నిన కేసులో  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కీలక అడుగు వేసింది. ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థతో  సంబంధాలు కలిగిన ఉండి, ఈ భయంకరమైన ప్లాన్ వేసిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌‌తో పాటు యూపీకి చెందిన ఆజాద్, మహమ్మద్ సుహేల్‌‌లపై ఎన్ఐఏ మంగళవారం గుజరాత్ అహ్మదాబాద్‌‌లోని స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ మొహియుద్దీన్.. ఐసిస్ ప్రతినిధి అమీర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌‌లోని తన నివాసంలోనే రహస్య ప్రయోగశాల ఏర్పాటు చేశాడని.. ఆముదం గింజల నుంటి అత్యంత ప్రాణాంతకమైన ‘రైసిన్’ అనే విష పదార్థాన్ని తయారు చేసినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్‌‌లో వివరించింది. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో ఈ విషాన్ని ప్రయోగించి.. భారీ ప్రాణనష్టం కలిగించడమే వీరి లక్ష్యమని తేలింది.

గతేడాది నవంబర్‌‌లో గుజరాత్ ఏటీఎస్ నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి అక్రమ ఆయుధాలతో పాటు నాలుగు లీటర్ల ఆముదం ద్రవం ఉన్న సీసాను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కుట్రకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను సేకరించిన ఎన్ఐఏ.. నిందితులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఉపా), ఆయుధాల చట్టంతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. చదువుకున్న వైద్యుడే ఇలాంటి జిహాదీ మాడ్యూల్‌‌లో భాగస్వామి కావడం ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన అంశమని ఛార్జిషీట్ ఎన్ఐఏ పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.