
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో ఆ జట్టు ఖాతాలో ఒక అత్యంత చెత్త రికార్డు వచ్చి చేరింది. సొంత మైదానంలో కనీసం పోరాట పటిమ చూపలేక 155 పరుగులకే పరిమితమైన ఢిల్లీ, ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచిన జట్టుగా నిలిచింది.
పవర్‌ప్లేలో ఢిల్లీ చెత్త రికార్డులు
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పవర్‌ప్లే (మొదటి 6 ఓవర్లు) లో దారుణంగా విఫలమవుతున్నారు. క్రిక్‌బజ్ గణాంకాల ప్రకారం.. నాలుగు కీలక అంశాల్లో ఢిల్లీ ఈ సీజన్‌లోనే అత్యంత చెత్త జట్టుగా నిలిచింది:
1. వికెట్ల పతనం: ఇప్పటివరకు పవర్‌ప్లేలో ఏకంగా 21 వికెట్లు కోల్పోయారు.
2. యావరేజ్ రన్స్: ఒక్కో వికెట్‌కు కేవలం 23.85 పరుగులు మాత్రమే సాధిస్తున్నారు.
3. రన్ రేట్: ఓవర్‌కు కేవలం 8.35 పరుగులు మాత్రమే రాబడుతున్నారు.
4. డాట్ బాల్స్: ఏకంగా 46.4 శాతం బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయడం లేదు.
సిఎస్‌కె బౌలర్ల ధాటికి విలవిల
ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, బ్యాటర్లు ఏమాత్రం అప్లికేషన్ చూపించలేకపోయారు. ఓపెనర్ పతుమ్ నిస్సంక (19) ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో అవుట్ కాగా, కె.ఎల్. రాహుల్ (12) అకీల్ హొస్సేన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ కేవలం 37 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా కనీస బాధ్యత లేకుండా పెవిలియన్ చేరడం గమనార్హం.
సొంత మైదానంలో పరాయి జట్టుకు మద్దతు
ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, స్టేడియం అంతా పసుపు మయంగా మారిపోయింది. ధోనీ వస్తున్నాడన్న వార్తతో ఫ్యాన్స్ ఎగబడ్డారు (ధోనీ మ్యాచ్‌కు రాకపోయినా). సిఎస్‌కె.. సిఎస్‌కె.. అన్న నినాదాలతో ఢిల్లీ ప్లేయర్లు మానసిక ఒత్తిడికి గురైనట్లు కనిపించింది. గత మ్యాచ్‌లో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయిన భయం బ్యాటర్ల కళ్లలో స్పష్టంగా కనిపించింది. కరుణ్ నాయర్, నితీష్ రాణాలు పేలవమైన స్వీప్ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు.
రిజ్వీ, స్టబ్స్ పోరాటం వృధా
ఒక దశలో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 38), ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (24 బంతుల్లో 40) అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కానీ, టాప్ ఆర్డర్ చేసిన నష్టం ముందు ఈ స్కోరు సరిపోలేదు. చివరికి సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో సిఎస్‌కె ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..