
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చగా.. మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే ఈ సమ్మర్‌లో కురుస్తున్న ఈ అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో అకాల వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో తమకు అదుకోవాలని ప్రభుత్వాలను రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వాలు కోరుతున్నాయి.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నేటి నుంచి మే 7వ తేదీ వరకు నాగర్ కర్నూల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక హైదరాబాద్‌కు కూడా వర్షసూచన జారీ చేసింది. నగరంలో ఈ రోజు, రేపు కూడా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. 3 డిగ్రీల మేర తగ్గనున్నాయి.
ఏపీలో వర్షాలు
అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇక ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. రైతులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో వడగాల్పులతో ప్రలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఎండ వేడితో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.