Reading Time: < 1 minute
దేశవ్యాప్తంగా భానుడు భగభగలు.. కానీ అక్కడ మాత్రం..

జమ్మూ-కశ్మీర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎత్తైన పర్వత ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుంది. ఈ ఆకస్మిక మార్పు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. భారీ హిమపాతం కారణంగా ముందుజాగ్రత్త చర్యగా అధికారులు కీలకమైన మొఘల్ రోడ్డును మూసివేశారు. రాజౌరి, పూంఛ్ జిల్లాలను కశ్మీర్ లోయతో కలిపే ఈ రహదారి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. అయితే రహదారిపై మంచు పేరుకుపోయి ఉపరితలం జారుడుగా మారడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాకపోకలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొఘల్ రోడ్డు మార్గంలో సుమారు 150 నుంచి 200 వాహనాలు ముందుకు కదల్లేక నిలిచిపోయాయి.

ప్రస్తుతం రహదారిని క్లియర్ చేసి, వాహనాలను తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాతావరణం కుదుటపడే వరకు ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు, ఈదురు గాలులు వీస్తున్నాయని నివేదించింది. మే 5న అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ళు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మే 6 నుంచి 9 వరకు వాతావరణం సాధారణంగా పొడిగా ఉండే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ప్రతికూల వాతావరణంలో బోటింగ్, షికారా రైడింగ్‌లను నిలిపివేయాలని, అలాగే వదులుగా ఉన్న నిర్మాణాలు, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ కార్యాలయం ప్రజలకు సూచించింది.