Reading Time: 2 minutes
SRH vs KKR: కోల్‌కతా బౌలర్లు దూకుడు.. స్వల్ప స్కోరుకే తోకముడిచిన సన్‌రైజర్స్..!

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: సొంత గడ్డపై భారీ స్కోర్లు నమోదు చేస్తూ ప్రత్యర్థులను భయపెట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ విరుచుకుపడటంతో ఒకానొక దశలో హైదరాబాద్ 200 పైచిలుకు పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ, మిడిల్ ఓవర్లలో కేకేఆర్ బౌలర్లు పుంజుకున్న తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

హెడ్ ధాటి.. పవర్‌ప్లేలో జోరు..

ఇన్నింగ్స్ ప్రారంభించిన ట్రావిస్ హెడ్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మ (15) త్వరగానే నిష్క్రమించినా, హెడ్, ఇషాన్ కిషన్ కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 105/1 తో పటిష్ట స్థితిలో ఉంది.

మలుపు తిప్పిన వరన్ చక్రవర్తి ..

బాగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ (61)ను వరున్ చక్రవర్తి అవుట్ చేయడంతో హైదరాబాద్ పతనం మొదలైంది. వరున్ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో అనీకేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్ వంటి యువ ఆటగాళ్లను వరుస ఓవర్లలో అవుట్ చేసి కేకేఆర్‌కు ఆధిక్యాన్ని అందించాడు.

సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డు..

ఈ మ్యాచ్ కోల్‌కతా స్పిన్ దిగ్గజం సునీల్ నరైన్‌కు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సలీల్ అరోరాను అవుట్ చేయడం ద్వారా నరైన్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. లాసిత్ మలింగ వంటి దిగ్గజాల సరసన చేరాడు. తన 4 ఓవర్లలో కేవలం 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి హైదరాబాద్ వెన్ను విరిచాడు.

వైఫల్యం చెందిన మిడిల్ ఆర్డర్..

హెన్రిచ్ క్లాసెన్ (11) ఈ సీజన్‌లో మొదటిసారిగా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్ పట్టిన అద్భుతమైన ఒంటిచేతి క్యాచ్‌కు క్లాసెన్ పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ (42) కాసేపు పోరాడినా, నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. చివరిలో పాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కార్తీక్ త్యాగి చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను 165 పరుగుల వద్ద ముగించాడు.

కేకేఆర్ ముందున్నది మోస్తరు లక్ష్యమే అయినప్పటికీ, ఉప్పల్ పిచ్‌పై హైదరాబాద్ బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..