Reading Time: 2 minutes
Pakistan Increases Bounty On Masood Azhar Ahead Of Fatf Meet What We Know

Pakistan: జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన మసూద్ అజర్‌పై దాయాది దేశం పాకిస్తాన్ రివార్డును పెంచింది. అతడి అరెస్ట్‌కు దారితీసే సమాచారాన్ని ఇస్తే, ఇచ్చిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ.24.09 లక్షలు) చెల్లిస్తామని ప్రకటించింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) మసూద్ అజర్‌ను తమ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా జాబితా చేసింది.

అయితే, ఈ పరిణామాలు అక్టోబర్ 26 నుంచి 30 వరకు పారిస్‌లో జరగబోతున్న ‘‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF)’’ ప్లీనరీకి ముందు జరిగింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్‌కు పాల్పడే దేశాలపై FATF ఆంక్షలు విధిస్తుంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ కీలక చర్య తీసుకుంది.

లేడూ అంటూనే బౌంటీ..

మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూనే పాకిస్తాన్ బౌటీని పెంచింది. అతను ఆఫ్ఘనిస్తాన్ పారిపోయాడంటూ గత కొన్నేళ్లుగా కథలు చెబుతోంది. మరోవైపు, FIA విడుదల చేసిన ‘‘2026 రెడ్ బుక్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ హై-ప్రొఫైల్ టెర్రరిస్ట్స్’’లో అజర్ పేరు ఉంది.

జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడైన అజర్, భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. 2001 పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై ఉగ్రదాడి, 2016 పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడి, 2019 పుల్వామా అటాక్‌లో జైషే మహ్మద్ ప్రమేయం ఉంది. గతేడాది ఆపరేషన్ సిందూర్ లో భారత్ జైషే హెడ్ క్వార్టర్ ఉన్న పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌పై దాడి చేసింది.

IC-814 హైజాక్ తర్వాత విడుదల..

మసూద్ అజర్ ఒకప్పుడు భారత కస్టడీలోనే ఉన్నాడు. 1999 ఇండియన్ ఎయిర్ లైన్స్ C-814 విమానం ఖాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో హైజాక్‌కు గురైంది. ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కరడుగట్టిన ఉగ్రవాదుల్ని భారత్ విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో మసూద్ అజర్ కూడా ఉన్నాడు.

ఆపరేషన్ సిందూర్‌లో కుటుంబం ఖతం..

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ లోని టెర్రర్ స్థావరాలపై దాడులు చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసింది. ఆ సమయంలో మసూద్ అజర్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, అతడి కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహిత సహాయకులు మరణించినట్లు సమాచారం. మృతుల్లో అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.