
తెలిసో తెలియకో.. జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఉంది ఆ చిన్నారి.. తండ్రిపై దాడిని చూస్తూ ఉంది.. షాపులోకి వచ్చిన దొంగ ఎలా కొడుతున్నాడు.. ఎలా బెదిరిస్తున్నాడో చూస్తూ ఉంది ఆ చిన్నారి.. తండ్రిపై దాడినే కాదు.. షాపులో డబ్బులు, ఇతర విలువైన వస్తువులను కత్తి పెట్టి బెదిరించి మరీ తీసుకుంటున్న వైనం కళ్లారా చూసిన చిన్నారి.. చివర్లో.. తాను తింటూ ఉన్న లాలీపాప్‌ను దొంగకు ఇస్తుంది.. ఆ తర్వాత ఆ దొంగ ఏం చేశాడు.. ఎలా బిహేవ్ చేశాడు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యం ఏంటీ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్న పిల్లలను చూస్తే ఎంత కఠిమైన మనస్సు ఉన్నవారు కూడా కరిగిపోతారంటుంటారు. జీవితంలో, ఉద్యోగంలో ఎన్ని టెన్షన్స్, ఒత్తిడి ఉన్న చిన్నారుల ముఖం చూస్తే మాయమైపోతుంటాయి అంటుంటారు.. ఇందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనే సాక్ష్యం. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఆ వీడియో ప్రకారం.. ఓ దొంగ షాపులోకి చొరబడ్డాడు.
షాపు యాజమానిపై దాడి చేస్తూ కౌంటర్లో ఉన్న డబ్బు లాక్కున్నాడు. ఇందతా జరుగుతున్నప్పుడు షాప్ యాజమాని కూతురు కూడా అక్కడే ఉంది. తండ్రిపై దుండగుడు దాడి చేయడం, షాపులో డబ్బులు, ఇతర విలువైన వస్తువులను కత్తి పెట్టి బెదిరించి లాక్కోవడం చూసింది. అసలు ఏం జరుగుతుందో అర్ధంకానీ ఆ చిన్నారి జాలి ముఖంతో తన చేతిలో ఉన్న లాలీ పాప్‌ను దొంగకు ఇచ్చింది. చిన్నారి చేసిన పనితో ఆ దొంగ మనసు కరిగిపోయింది.
లాలీ పాప్ తిరిగి ఆ చిన్నారికే ఇచ్చేసి కౌంటర్లో తీసుకున్న డబ్బును కూడా తిరిగి చిన్నారి తండ్రికి ఇచ్చేశాడు. అలాగే, షాపులో దొచుకున్న ఇతర వస్తువులు కూడా మళ్లీ అక్కడే పెట్టేశాడు. చివరకు షాప్ నుంచి పోతూ పోతూ ఆ చిన్నారి తలపై ఆప్యాయంగా ముద్దాడాడు. ఈ తతంగమంతా షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిన్నారి అమాయకత్వం.. పెద్ద దోపిడీనే ఆపింది.. నాన్నను కాపాడింది.. మానవత్వానికి ఉన్న పవర్ అలాంటిదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.