Reading Time: 2 minutes

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక మెగా స్కామ్: రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

Caption of Image.

అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ.. పర్యావరణ యుద్ధానికి వేదికైంది. సుమారు రూ.81వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నేచ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేట్ నికోబార్ ఐలాండ్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రాజెక్టును “దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి”గా అభివర్ణించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ విధ్వంసం ప్రకృతికి, గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని తీవ్రంగా మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 160 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అత్యంత పురాతన వర్షారణ్యాలు కనుమరుగవుతాయని హెచ్చరించారు రాహుల్ గాంధీ. కోట్లాది చెట్లను నరికివేయడం వల్ల అక్కడి జీవవైవిధ్యం దెబ్బతినడమే కాకుండా, శతాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న స్థానిక గిరిజన తెగలు నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం అభివృద్ధి కాదని, పర్యావరణ వినాశనానికి వేస్తున్న పునాది అంటూ విమర్శించారు.

పర్యావరణ రక్షకులు కూడా ఈ ప్రాజెక్టుపై గళమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన జీవజాలం ఉన్న ప్రాంతాల్లో గ్రేట్ నికోబార్ ఒకటి. ఇక్కడ ఓడరేవు, ఎయిర్‌పోర్ట్, లాజిస్టిక్ హబ్ నిర్మించడం వల్ల సముద్రపు తాబేళ్లు, ఇతర అరుదైన జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలక్కా జలసంధికి సమీపంలో ఉండటం వల్ల ఇది వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైనప్పటికీ.. దాని కోసం మనం చెల్లించే పర్యావరణ మూల్యం తిరిగి పొందలేనిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివాదం కొనసాగుతున్న వేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం గమనార్హం. పర్యావరణ రక్షణకు సంబంధించి కొన్ని షరతులు విధిస్తూ.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవచ్చని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదన ప్రకారం.. ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ద్వారా భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని చెబుతోంది.

ప్రస్తుతం ఈ చర్చ కేవలం మౌలిక సదుపాయాల గురించి మాత్రమే కాదు.. మనం ఎంచుకుంటున్న అభివృద్ధి మార్గం గురించి కూడా. పర్యావరణాన్ని పణంగా పెట్టి సాధించే ఆర్థిక వృద్ధి ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో భారత పర్యావరణ విధానాలపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి చేర్చడమే కాకుండా.. అభివృద్ధి, పర్యావరణం మధ్య ఉండాల్సిన సమతుల్యతపై చర్చకు దారితీసింది. 

©️ VIL Media Pvt Ltd.