Reading Time: < 1 minute

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

Caption of Image.

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గత పది రోజులుగా కాంటినెంటల్ హాస్పిటల్లో నాదెండ్ల భాస్కరరావు చికిత్స పొందుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిలవ్వడంతో ఆయనకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నాదెండ్ల భాస్కరరావుకు ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. నాదెండ్ల భాస్కర రావు వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. 1984లో ఆగస్ట్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకూ నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్.2గా ఉన్న సంగతి తెలిసిందే. నాదెండ్ల భాస్కర రావు 2019 జూలై 6న, హైదరాబాద్ శంషాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నాదెండ్ల భాస్కర రావు 1978లో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. నాదెండ్ల భాస్కర రావు టీడీపీ సహ వ్యవస్థాపకుడు కావడం గమనార్హం. ఎన్టీఆర్ మంత్రివర్గంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టులో, టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంనర తర్వాత ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంలో మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ (ఐ), టీడీపీలోని ఒక వర్గం మద్దతుతో ఎన్టీఆర్ ప్రభుత్వంపై నాదెండ్ల తిరుగుబాటు చేశారు. 

ఏపీ రాజకీయాల్లో ఇప్పటికీ ఇదో కీలక పరిణామం. ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది. నాదెండ్ల భాస్కరరావును టీడీపీ నుంచి బహిష్కరించారు.

©️ VIL Media Pvt Ltd.