
పెళ్లైంది ప్రస్తుతానికి పిల్లల్లేరు.. బాధ్యతల్లేవు. అయినా నెలకు అంతంత ఖర్చు చేస్తున్నారా? అని మధ్యతరగతి పేరెంట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరిగురించో కాదండీ బాబు.. ఈ మధ్య ఒక బెంగళూరు కపుల్ నెలవారీ బడ్జెట్ గురించి చేసిన వీడియోపై వస్తున్న కామెంట్స్. సాధారణంగా పిల్లలు పుడితేనే ఖర్చులు తడిసి మోపెడవుతాయని భయపడే ఈ రోజుల్లో.. కేవలం ఇద్దరే జాబ్ చేసుకుంటూ(DINK – Double Income No Kids) రెండు చేతులా సంపాదిస్తున్న DINK కపుల్.. నెలకు ఏకంగా రూ.82వేలు ఖర్చు చేస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఐశ్వర్య ఘోష్ అనే యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘సిటీ బడ్జెట్’ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
బెంగళూరు లాంటి సిటీలో తలదాచుకోవడమే పెద్ద టాస్క్. ఈ జంట ఉండడానికి ఇల్లు, దానికి మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.29వేలు కడుతున్నారు. పోనీ సామాన్లు కొన్నారా అంటే అదీ లేదు.. ఫర్నీచర్ అద్దెకే మరో రూ.2వేల 500. ఇక పనిమనిషికి రూ.2వేల 800.. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, వైఫై అంటూ బిల్లులన్నీ కలిపి మరో రెండు మూడు వేలు. అంటే గడప దాటకముందే సగం జీతం హాంఫట్ అయిపోతోందన్నమాట.
మా బామ్మగారి కాలంలో రూ.6వేలు అంటే ఇల్లు గడిచేది.. వీళ్లు కేవలం నెలకు కిరాణా సామాన్లకే అంత పెడుతున్నారు అని కొందరు దీన్ని చూసినవారు అభిప్రాయపడుతున్నారు. ఇక బయట తిండికి, స్నేహితులతో పార్టీలకు కలిపి నెలకు రూ.9వేల వరకూ ఖర్చు చేస్తోంది ఈ యువ జంట. రవాణా విషయానికి వస్తే బైక్ పెట్రోల్ కంటే మెట్రో, క్యాబ్‌లకే ఎక్కువ అవుతోంది. వీటన్నిటికీ మించి ‘వకేషన్ ఫండ్’ పేరుతో టూర్లు వెళ్లేందుకు నెలకు రూ.15వేలు విడిగా దాచుకుంటున్నారు. అంటే ఏడాదికి దాదాపు 2 లక్షలు జస్ట్ టూర్లకే ఖర్చవుతోందన్నమాట.
ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరేమో చాలా ప్రాక్టికల్ బడ్జెట్ వారిద్దరిదీ అంటూ.. బెంగళూరులో ఇంతకంటే తక్కువలో బ్రతకడం కష్టం అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మేము కూడా ఇద్దరమే ఉంటాం.. మాకు లక్ష దాటుతోంది, మీకు 81 వేలకే ఎలా సరిపెట్టుకుంటున్నారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మొత్తానికి డబ్బులు సంపాదించేది అనుభవించడానికే కదా అనే ఈ జనరేషన్ ఆలోచనలకు ఈ డింక్ కపుల్ బడ్జెట్ దగ్గరగా ఉంది. అయితే మిడిల్ క్లాస్ పేరెంట్స్ మాత్రం రేపు పిల్లలు పుడితే ఎలాగబ్బా? అంటూ ఆలోచనలో పడిపోతున్నారు.