
ఒకవైపు ఘోరమైన దాడులు చేస్తూ.. బాంబుల మోత మోగిస్తూనే.. మరోవైపు శాంతి చర్చలు అంటోంది ఇజ్రాయెల్. లెబనాన్ లోని బీరుట్ బేకా లోయతో పాటు దక్షిణ ప్రాంతంపై తీవ్ర దాడులు చేసిన ఇజ్రాయెల్.. దాదాపు 250 మందిని మట్టుబెట్టింది. సీజ్ ఫైర్ లో భాగంగా అమెరికా కాల్పులను తాత్కాలికంగా విరమించుకున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా తగ్గకుండా దాడులు చేసింది. లెబనాన్ లోని హిజ్ బుల్లాలే అంతంగా దాడులు చేస్తున్నట్లు చెప్పింది. లెబనాన్ సీజ్ ఫైర్ కిందికి రాదని పేర్కొంది.
ఇంత మారణకాండకు కూడా వెనుకాడని ఇజ్రాయెల్ లేటెస్టుగా శాంతి చర్చలకు సిద్ధం అంటూ సంకేతాలు పంపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని ఈ దాడులకు మరుసటి రోజు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.
లెబనాన్ తరచుగా చర్చలు కోరుతున్నందున, వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని తన కేబినెట్ ని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ చర్చలు హెజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాంతిపూర్వక సంబంధాలు ఏర్పాటు చేయడం అనే అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు.
అయితే లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్ మాత్రం, ముందుగా సీజ్‌ఫైర్ అంటే యుద్ధవిరామం కావాలని, ఆ తర్వాతే చర్చలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. లెబనాన్ సమస్యకు ఏకైక పరిష్కారం ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య సీజ్‌ఫైర్ సాధించి, ఆ తర్వాత నేరుగా చర్చలు జరపడమే అని అన్నారు. లెబనాన్ అధికారులు తమకు అమెరికా హామీ ఇచ్చి అండగా ఉండాలని కోరుతున్నారు. మొదటి సమావేశం వాషింగ్టన్‌లోని స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో జరగనుంది.
మార్చి 2వ నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు దాడులు చేయడంతో ఈ ఘర్షణ తీవ్రతరం అయ్యింది. ఇప్పటి వరకు లెబనాన్ వైపు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 1,700 మంది చనిపోగా, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. హెజ్బుల్లా వైపు కూడా వందలాది మంది సైనికులు చనిపోయినట్లు సమాచారం.