
లీటర్ కాదు రెండు లీటర్లు కాదు.. ఏకంగా 11 వేల లీటర్ల పాలు నీటి పాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా ట్యాంకర్ల కొద్దీ పాలను నదిలో పోయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకవైపు విమర్శలు మరోవైపు భక్తుల మద్ధతుతో ఈ అంశంపై రెండుగా విడిపోయి డిబేట్ నడుస్తోంది. దేశంలో పౌష్టికాహార లోపంతో ఎందరో చిన్నారులు చనిపోతుంటే.. వేల లీటర్లు నీళ్ల పాలు చేయడమేంటనే చర్చ నడుస్తోంది. ఆధ్యాత్మికత, విశ్వాసం పేరుతో చేసిన ఈ ఉత్సవం కొందరికి వేడుకలా కనిపిస్తే.. మరికొందరు మూఢ నమ్మకంతో ఆహారపదార్థాలను వృధా చేయడమేనని ప్రశ్నిస్తున్నారు.
ట్యాంకర్ల కొద్ది పాలను నర్మదా నదిలో పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మత విశ్వాసాలు, పర్యావరణ బాధ్యత, దేశంలో ఆహార కొరత అనే అంశాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఆధ్యాత్మిక సమర్పణలో భాగంగా 11,000 లీటర్ల పాలను భక్తులు నర్మదా నదిలో పోస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని సెహోరెలో నర్మదా నది దగ్గర వందల సంఖ్యలో గుమిగూడిన భక్తులు పాలను నదిలో పోస్తూ వేడుక నిర్వహించారు. బెరుండా ప్రాంతం దగ్గర సత్ దేవ్ లోని పటాలేశ్వర్ మహదేవ్ ఆలయం లో 21 రోజుల మహాయజ్ఞం పూర్తైన సందర్భంగా.. నర్మదా నదికి అభిషేకం చేశారు.అభిషేకం పేరుతో ఏకంగా 11 వేల లీటర్ల పాలను నదిలో పోస్తూ మంత్రోచ్ఛరణల మధ్య వేడుక నిర్వహించారు.
మార్చి 18న మొదలైన మహాయజ్ఞం ప్రతి రోజు మహాహవన్ కార్యక్రమంతో మొదలవుతుంది. ప్రతిరోజు 21 క్వింటాళ్ల ధాన్యం, ఇతర యజ్ఞ సామాగ్రిని హోమగుండంలో వేస్తూ హోమం నిర్వహించారు. 21 రోజుల్లో మొత్తం 41 టన్నుల విలువైన యజ్ఞ సామాగ్రిని వినియోగించారు. వీటితో పాటు బంగారం, వెండిని కూడా హోమగుండంలో అగ్నికి ఆహుతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యంగా భాంద్రా కమ్యూనిటీకి చెందిన వేలాది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు.
Also Read : బారామతి నుంచి కాంగ్రెస్ ఉపసంహరణ
అయితే ఇంత ఘనంగా జరిపిన ఈ హోమం తీవ్ర విమర్శలకు గురవుతోంది. దీనిపై రెండుగా చీలిపోయారు. ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఇది సహజమేనని కొందరు వాదిస్తుండగా.. మరి కొందరు భక్తి అనేది ఆహారం వృధా చేయకుండా ఉండాలని.. పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటే మంచిదని వాదిస్తున్నారు.
పాలు కాలుష్యకారకమా..?
పాలతో ఎలాంటి నష్టం లేదని అందరికీ తెలిసిన విషయమే. అయితే పర్యావరణ వేత్తలు మాత్రం.. పాలు కాలుష్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. తాగటానికి, తినటానికి వినియోగించడం వలన పాలతో ఎలాంటి నష్టం లేదని.. కానీ వేల లీటర్లు స్వచ్ఛమైన నీటిలో పోయడం కారణంగా కాలుష్యకారకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
పాలలో మంచి కొవ్వు, ప్రోటీన్, షుగర్ కంపౌండ్స్ ఉన్నప్పటికీ అది ఎక్కువ మొత్తంలో నదిలో పోయటం ద్వారా.. నదిని కలుషితం చేస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో పాలు నీటిలో కలవటం ద్వారా బ్యాక్టీరియా పెరిగిపోయి.. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గేలా చేస్తుందని చెబుతున్నారు. దీన్నే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) అంటారు. దీని కారణంగా నీటిలో ఉండే చేపలు, ఇతర జలచరాలకు ఆక్సిజన్ లోపంతో చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
పర్యావరణ ఆందోళనలతో పాటు ఈ ఘటన ఆకలి, అసమానతల కోణంలో చర్చకు దారితీసింఇ. ధర్మం పేరుతో ఆహారాన్ని వృద్ధా చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ధర్మం పేరుతో చేసే అపహాస్యం. ఇలా దొంగల బాబా దేశానికి, ధర్మానికి చాలా నష్టం కలిగిస్తున్నారు. వీరి వల్లే ధర్మం అపఖ్యాతి పాలవుతోంది అంటూ పోస్టులు పెడుతున్నారు. పాఠశాలల్లోని పేద పిల్లలకు కల్తీ పాలు అందుతున్నాయి.. కానీ వేల లీటర్లు ఇలా వృధా అవుతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
గ్రామీణ భారతంలో పేద వర్గాల పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఆచారాల పేరుతో వృధా చేసిన పాలను వేలాది మంది పిల్లల పోషణకు ఉపయోగిస్తే ఎంత మార్పు జరిగేది అని వాదిస్తున్నారు. కొందరి కామెంట్స్ చూస్తుంటే.. అన్నపు రాసులు ఒక చోట.. ఆకలి కేకలు ఒక చోట.. అని ఒక కవి రాసిన పంక్తుల్ని గుర్తుకొస్తున్న సందర్భం.
11 हजार लीटर दूध नर्मदा नदी में चढ़ा दिया गया !! pic.twitter.com/xep3ZAZOs8
— Sachin Gupta (@Sachingupta) April 9, 2026