
కోరుట్ల, వెలుగు : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పాత బస్టాండ్ వద్ద బుధవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,200 కాగా.. వ్యాపారులు రూ. 1,700 మాత్రమే చెల్లిస్తున్నారని, దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్, పోలీసులకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.