
- బీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్‌రెడ్డితో కీలక భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో జీవన్‌రెడ్డిని అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇరువురి మధ్య పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జగిత్యాలకు వెళ్లే ముందు కేటీఆర్, ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.
ఈ భేటీలో జీవన్‌రెడ్డి చేరికతో పాటు ఈ నెల 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ నిర్వహించాలా, లేక ప్లీనరీ తరహాలో కార్యక్రమం ఏర్పాటు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో వేడుకల వేదికను ఖరారు చేసే దిశగా కూడా చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.