
హసన్‌పర్తి, వెలుగు: లబ్ధిదారుల వద్ద రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ జి.బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులోని ఓ రహస్య స్థలంలో రేషన్ బియ్యాన్ని డంప్ చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.
వెంటనే దాడులు నిర్వహించగా అక్కడ 416 బస్తాల్లో సుమారు రూ.7 లక్షల విలువైన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. హసన్‌పర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఓర్సు భానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు మోటం మధుకర్, చిత్తారి ఎర్రగట్టు పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని, నిందితుడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు అప్పగించినట్లు సీఐ బాబులాల్ వెల్లడించారు.