Reading Time: < 1 minute

సైబర్ క్రైమ్‎లో రేణు దేశాయ్ ఫిర్యాదు.. ఎందుకంటే..?

Caption of Image.

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై చేస్తోన్న అసభ్యకర కామెంట్స్‎పై నటి రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‎ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం (మార్చి 2) సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొందరు తన పోస్టులకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

కాగా, వీధి కుక్కల అంశంపై మాట్లాడిన నాటి నుంచి సోషల్ మీడియాలో కొందరు రేణు దేశాయ్‏ను టార్గెట్ చేస్తున్నారు. ఆమె పోస్టులకు రాయలేని బాషలో కామెంట్స్ పెట్టడంతో పాటు అసభ్యకరమైన మీమ్స్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. 

తన వ్యక్తిగత జీవితం, పిల్లలు గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు. దేవుని మాల ధరించి నిండు బట్టల్లో ఉన్న తనని రాత్రికి రేటెంత అని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధుందా.. అసలు ఏం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు ఏమన్నా ఓపికా పట్టాను.. ఇక భరించడం నావల్ల కాదని అన్నారు.  ఇకపై సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు చేసే వాళ్ల ఇంటికి వచ్చి సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.