
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నియామకాలకు సంబంధించి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) అభ్యర్థుల ప్రాథమిక వివరాలను బుధవారం విడుదల చేసింది. బోర్డు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఫిర్యాదు సమర్పించవచ్చని తెలియజేసింది. అభ్యర్థుల లాగిన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది.
దరఖాస్తులో దొర్లిన తప్పులు లేదా మెరిట్ లెక్కింపులో వ్యత్యాసాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే, వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను సిద్దం చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చడానికి ఈ నియామకాలు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సాధ్యమయినంత త్వరగా కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.