
ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఔటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి.. వాషింగ్టన్ సుందర్‌ని ఆడించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సుందర్‌ని సెలెక్ట్ చేయడంపై కోచ్ గంభీర్‌ని ఎగతాళి చేశారు. అన్ని సమస్యలకు సుందరే పరిష్కారమని గంభీర్ భావిస్తున్నారని సంజయ్ సెటైర్లు వేశారు.
‘ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పి, కడపునొప్పి కూడా సర్వరోగ నివారిణిలా వాడతారు. అయితే గౌతమ్ గంభీర్ సైతం అన్ని సమస్యలకు పరిష్కారంలా వాషింగ్టన్ సుందర్‌ని చూస్తున్నారు. బ్యాటింగ్‌లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! బౌలింగ్‌లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! అంటున్నారు. అతడిని ఏకంగా ఐదో స్థానానికి ప్రమోట్ చేశారు. అతడి తర్వాత రింకు సింగ్, హార్థిక్ పాండ్యను బ్యాటింగ్‌కి పంపారు’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని పక్కనపెట్టి.. స్లో బాల్స్ ఎలా ఆడాలో కూడా ప్రాక్టీస్ చేయండి. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్నర్లను ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ నెమ్మదిగా వచ్చే బంతుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు’ అని సంజయ్ పేర్కొన్నారు.