Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీం ఇండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సూర్యకుమార్ సేన.. సఫారీల ముందు చతికిలపడింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. సౌతాఫ్రికాతో ఓటమి భారత జట్టకు ఓ మేలుకొలుపు అని ఆయన అన్నారు.

‘‘భారత్ టి-20 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచుల్లో (గత ప్రపంచకప్ విజయాలతో కలిపి) విజయం సాధించింది. కానీ, దక్షిణాఫ్రికాతో ఓటమిపాలయ్యారు. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. జట్టు కూర్పులో మార్పులు, చేర్పులు చేసేందుకు సమయం ఆసన్నమైంది. జట్టు ప్రణాళికల గురించి పునరాలోచన చేయాలి. భారత్ ఇకపై తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే మరో మ్యాచ్ ఓడితే చాలా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది’’ అని శాస్త్రి అన్నారు.

జింబాబ్వేతో జరిగే మ్యాచ్ నేపథ్యంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ‘‘అక్షర్ పటేల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే అతడి అనుభవం జట్టుకు అవసరం. అలాగే వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఆడించాలి. అదనపు స్పిన్నర్ ఉంటే అది జట్టుకే మంచిది. అక్షర్‌ను నెం.8 స్థానంలో ఆడించాలి. ఐదో స్థానంలో హార్థిక్, నెం.6లో శివమ్ దూబె, నెం.7లో వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ఆడాలి’’ అని రవిశాస్త్రి సూచించారు.