Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తొంది. డయేరియాతో ఒకరు మృతి చెందగా 70 మంది బాధితులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మంగువారితోట ప్రాంతంలో కండ్రవీధికి చెందిన మండల సురేశ్‌(43) మంగళవారం తెల్లవారుజామున డయేరియాతో చనిపోయాడు. స్థానిక మీడియాలో మాత్రం నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీకాకులం జిల్లా కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, కుమ్మరివీధి, కాకివీధి, సారంగడాల వీధి, ఎచ్చెర్లవారి వీధి, గోల్కొండరేవు, రంగిరీజు వీధుల్లో డయేరియా వీరవిహారం చేస్తోంది. డయేరియాను గుర్తించడంలో యంత్రాంగంతో పాటు ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. రోజురోజుకీ డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతున్నకూడా పట్టించుకోవడం లేదని,  వైద్య సేవలు కూడా అందుబాటులో లేవని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరణాలు సంభవిస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై బాధితుల కుటుంబాలతో పాటు శ్రీకాకుళం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు పెరగడంతో ప్రజలు మండిపడుతున్నారు. మంచినీరు సరఫరా చేయలేక యంత్రాంగం చేతులెత్తేసింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సొసైటీ నీరు అందిస్తుంది. దళిత వాడల్లో నీళ్లు కూడా ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దళిత మహిళలు ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు.