
రెండు నెలల పసికందు తో నవ్వులతో ఉండాల్సిన ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. తల్లి ప్రేమతో ముద్దాడాల్సిన చేతులే కసాయిగా మారి కన్నబిడ్డ ప్రాణం తీశాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని స్పీడ్ సానరెల్లి బహుళ అంతస్తుల భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న మమత (మధ్యప్రదేశ్ రాష్ట్రం, సాగర్ జిల్లా, నవగావ్ గ్రామం నివాసి) తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే పనిచేస్తూ అక్కడే నివసిస్తోంది. మంగళవారం ఉదయం మమత భర్త పనిమీద బయటకు వెళ్లగా, మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద అనుమానాస్పద వాతావరణం కనిపించడంతో లోపలికి వెళ్లి చూడగా భార్య మంటల దగ్గర ఉండడం గమనించాడు. అనుమానం వచ్చి ఆమెను పక్కకు నెట్టి చూడగా, రెండు నెలల చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు
హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడనే కారణంతో, బిడ్డను తొలగించాలని భావించిన మమత ముందుగా బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, అనంతరం ఇంట్లోనే ఉన్న కట్టెల పొయ్యిలో వేసి కాల్చినట్లు పోలీసుల దర్యాప్తు లో తేలింది .ఘటనపై సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.దుండిగల్ సీఐ సతీష్, ఎస్‌ఐ రంజిత్ తదితరులు విచారణలో చేపడుతున్నారు. ఈ దారుణ ఘటన జరిగిన భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం విషయం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అపార్ట్మెంట్ల విక్రయాలపై ప్రభావం పడుతుందనే కారణంతో మీడియాను అనుమతించలేదని పలువురు మీడియా ప్రతినిధులు వాపోయారు.పసికందుపై జరిగిన ఈ అమానుష ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. కన్నతల్లి చేతుల్లోనే శిశువు ప్రాణం కోల్పోవడం హృదయ విదారకం. కుటుంబ కలహాలా…? మానసిక సమస్యలా ? లేక మరేదైనా కారణమా ? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.