
హైదరాబాద్: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం శక్తిమంతమైన ప్రదేశం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని..కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కాంగ్రెస్ తో జతకట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక బిఆర్ఎస్ అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని తెలియజేశారు.
కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారని, మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తామని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్.. హిందువులకు సురక్షిత దేశంగా మారిందని, ఇవాళ ఇతర దేశాల్లోని హిందువులు భారత్ కు వస్తున్నారని బండి పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మజ్లిస్ పార్టీ బెదిరిస్తుందని, రాష్ట్రంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.