Reading Time: 2 minutes

SS Rajamouli: ఆయనకు నేను రుణపడి ఉన్నాను.. సింగీతం మరణంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్!

Caption of Image.

తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, సృజనాత్మకతకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్తతో సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి భావోద్వేగపూరితమైన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సింగీతంని కేవలం ఒక దర్శకుడిగా చూడలేం. సినిమా అనే మాధ్యమానికి ఉన్న హద్దులను చెరిపేసి.. ఊహలకు రెక్కలు తొడిగిన గొప్ప సృజనశీలి అని జక్కన్న గుర్తుచేసుకున్నారు. 

“మన దగ్గర గొప్ప టెక్నాలజీ, భారీ బడ్జెట్లు లేని రోజుల్లోనే.. మన చుట్టూ ఉన్నవారెవరూ ఊహించని స్థాయిలో పెద్ద కలలు కనడానికి ఆయన ధైర్యం చేశారు. ఒక్క మాట కూడా లేకుండా సినిమాను తెరకెక్కించారు. కాలాన్ని దాటి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. కామెడీ నుంచి ఫాంటసీ వరకు.. అక్కడి నుంచి ఎంతో లోతైన మానవీయ భావోద్వేగాల వరకు ఎలాంటి హద్దులూ లేవన్నట్టుగా విభిన్న జానర్లలో అద్భుతమైన సినిమాలు తీశారు” అని సింగీతం గారి సృజనాత్మకతను రాజమౌళి కొనియాడారు.

ఈ క్రమంలోనే సినిమాకు నిజమైన హద్దు సాంకేతికత, బడ్జెట్ లేదా వనరులు కాదని.. కేవలం ఊహాశక్తేనని ఒక తరం సినీ ప్రేమికులకు సింగీతం శ్రీనివాసరావు గారు నేర్పించారని రాజమౌళి అన్నారు. తెలుగు సినిమాలో కొత్తగా ఏదైనా ప్రయత్నించిన ప్రతి దర్శకుడిపై ఆయన ప్రభావం ఎంతో కొంత ఉంటుందని, తెలిసో తెలియకో ప్రతి ప్రయోగాత్మక దర్శకుడు ఆయన నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నారని తెలిపారు.

“తెలుగు సినిమాలో భిన్నంగా ఏదైనా చేయాలని ప్రయత్నించిన ప్రతి దర్శకుడు ఆయనకు ఏదో ఒక విధంగా రుణపడి ఉంటారు. నేను కూడా అందులో ఒకడినే” అంటూ రాజమౌళి తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ‘ఓం శాంతి’ అంటూ రాజమౌళి తన నివాళిని అర్పించారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా సింగీతంని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నివాళి అర్పించారు. “భారతీయ సినిమా ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. సింగీతం శ్రీనివాసరావు గారు పదానికి పూర్తి అర్థం చెప్పే లెజెండ్. అసాధారణమైన ఊహాశక్తి, ధైర్యం, ప్రతిభ కలిగిన గొప్ప దర్శకుడు. భారతీయ సినిమా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది” అంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

సింగీతం శ్రీనివాసరావు కేవలం ఒక దర్శకుడిగానే కాకుండా.. సినిమా పరిధులను విస్తరించిన అసాధారణ సృజనశీలిగా మహేష్ బాబు అభివర్ణించారు. తన ప్రత్యేకమైన ఆలోచనలు, వినూత్నమైన కథనం, ప్రయోగాత్మక సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.