
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రతిపాదించిన అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ ప్రణాళికకు బ్రేక్ పడింది. ఆ పనుల కోసం గతంలో తవ్విన భారీ గుంతలను అధికారులు ప్రస్తుతం పూడ్చివేస్తున్నారు. ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా మట్టిని తరలించి గుంతలను పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.
అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్విన రెండు భారీ గుంతలను అధికారులు పూడ్చివేస్తున్నారు. గుంతలను పూర్తిగా పూడ్చిన అనంతరం రోడ్డుకు సమాంతరంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల అండర్‌పాస్‌ల కోసం తవ్విన ఇతర గుంతలను కూడా దశలవారీగా పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గతంలో సుమారు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో భూసేకరణకే సుమారు రూ.1,040 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వడంతో పాత ప్రణాళికను పునఃపరిశీలించిన అధికారులు.. 7 అండర్‌పాస్‌లు, 7 స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేసినట్లు సమాచారం.
కొత్తగా 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్
పాత ప్రణాళికకు బదులుగా బంజారాహిల్స్‌లోని ముజఫర్‌కా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఈ కారిడార్‌ను సుమారు రూ.751 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల బైడైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రతిపాదనతో భూసేకరణ భారం కూడా గణనీయంగా తగ్గనుంది.
పాత ప్రణాళికలో 7 అండర్‌పాస్‌లు, 7 స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం విస్తృతంగా భూసేకరణ చేయాల్సి ఉండేది. ఇందుకోసం సుమారు రూ.1,040 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.కొత్తగా ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌తో భూసేకరణ అవసరం తగ్గి, భూసేకరణ వ్యయం రూ.300 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయాన్ని నియంత్రించడంతో పాటు నిర్మాణానికి అవసరమైన స్థల సమస్య కూడా తగ్గనుంది.
పార్క్ హయత్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మించిన పిల్లర్లను కొత్తగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌లో వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే జరిగిన నిర్మాణ పనులు వృథా కాకుండా కొత్త ప్రాజెక్టులో ఉపయోగపడే అవకాశం ఉంది.మరోవైపు, పాత అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం తవ్విన గుంతల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. గుంతలను పూడ్చిన అనంతరం ఆయా ప్రాంతాలను రహదారి అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు.