Reading Time: 2 minutes
Srikanth Odela Rejected 50k Offer For Sukumar

Srikanth Odela: వెండితెరపై తనదైన ముద్ర వేయాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మందికి అవకాశాలు రావడానికే ఏళ్లు గడిచిపోతుంటాయి. అలాంటిది కెరీర్ స్టార్టింగ్‌లోనే దేశంలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసే పిలుపు వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దానికితోడు అసిస్టెంట్ డైరెక్టర్‌కు నెలకు ఏకంగా రూ.50 వేల సాలరీ ఇస్తానంటే కాదనే పిచ్చోడు ఉంటాడా? కానీ, ఆ ఊహించని బంపర్ ఆఫర్‌ను సైతం ముఖం మీదే తిరస్కరించి సంచలనం సృష్టించారు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. .

ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్న శ్రీకాంత్ ఓదెల, తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక అనూహ్య సంఘటనను పంచుకున్నారు. “ఇండియన్ సినిమాలోనే టాప్ దర్శకుడిగా ఉన్న ఓ లెజెండరీ డైరెక్టర్ (ఆయన పేరు చెప్పను) దగ్గర నాకు అనుకోకుండా ఒక ఛాన్స్ తలుపు తట్టింది. రాత్రికి రాత్రే అనుకోని పరిణామాలు మారాయి. ఉదయానికల్లా ఆయన దగ్గరి నుంచి నేరుగా పిలుపొచ్చింది. ‘రేపట్నుంచే షూటింగ్‌కు వచ్చెయ్.. నీకు నెలకి రూ.50,000 ఇస్తా’ అని ఆయన చెప్పారు. ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌కు నెలకు రూ. 50 వేలు ఇవ్వడం అనేది ఎవరూ ఊహించని పెద్ద మొత్తం” అని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. చేతినిండా పైసలు, దేశంలోనే అగ్ర దర్శకుడితో కలిసి పనిచేసే అరుదైన అవకాశం ఎదురుగా ఉన్నా శ్రీకాంత్ గుండె మాత్రం చలించలేదు. ఆ దర్శకుడి ముందే ఏమాత్రం తడబడకుండా.. “సార్, నన్ను మన్నించండి. సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా నేర్చుకోవడమే నా ఏకైక లక్ష్యం. అక్కడ నేర్చుకున్నాకే భవిష్యత్తులో వేరే ఎక్కడైనా పనిచేస్తా తప్ప, ఇప్పుడు ఈ ఆఫర్‌ను అంగీకరించలేను” అని తేల్చి చెప్పారు. ఇంత పెద్ద ఆఫర్‌ను చేజేతులా వదులుకోవడం ఆ సమయంలో పెద్ద రిస్క్ అనిపించినా, ఆయన మాత్రం తన పట్టు వీడలేదు.

అలాంటి ఆఫర్‌ను కాదనుకున్న తర్వాత సుకుమార్ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టడం శ్రీకాంత్‌కు పూలబాటగా ఏమీ మారలేదు. సుకుమార్ దృష్టిలో పడేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. తాను రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్‌ను చూపిస్తూ, ఎన్నో తిప్పలు పడి చివరికి సుక్కు టీమ్‌లో స్థానం దక్కించుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ఆయన సుకుమార్ వద్ద అధికారికంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ మొండితనమే ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ బ్లాక్‌బస్టర్‌ను తీసేలా చేసి, ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకరిగా శ్రీకాంత్ ఓదెలను నిలబెట్టింది.